iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ మేనిఫెస్టో: అమ్మాయి పెళ్లికి తులం బంగారం.. లక్ష నగదు!

కాంగ్రెస్ మేనిఫెస్టో: అమ్మాయి పెళ్లికి తులం బంగారం.. లక్ష నగదు!

తెలంగాణలో ఎన్నికల హోరు మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈసారి కూడా అధికారంలోకి రాబోయేది తామేనని చెబుతోంది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీ చేసే నేతలను సిద్ధం చేసుకున్న బీఆర్ఎస్.. మహిళా ఓటర్లే లక్ష్యంగా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. అటు బీజెపీ కూడా హామీల పత్రాన్ని మెరుగులు దిద్దుతుంది.  కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా హామీలను గుప్పించేందుకు రెడీ అవుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోనియా గాంధీ తెలంగాణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ హామీలనను ప్రకటించిన సంగతి విదితమే. వీటితో పాటు మరో హామీని మ్యానిఫెస్టోలో చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో రాష్ట్ర ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు రూ. 2500 ప్రోత్సాహకం, గ్యాస్ సిలిండర్ రూ. 2500 ప్రకటించారు సోనియా గాంధీ. ఇప్పుడు ఈ మహాలక్ష్మి గ్యారెంటీ స్కీములోకి పెళ్లి చేసుకోబోయే యువతుల కోసం ఓ హామీనీ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన మహిళలకు వారి వివాహ సమయంలో 10 గ్రాముల బంగారాన్ని అందించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మహాలక్ష్మి హామీ ద్వారా వధువు కుటుంబానికి రూ. లక్ష అందించడంతో పాటు తులం బంగారాన్ని అందించాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ పేర్కొంది. ఈ అంశంపై పార్టీలోని సీనియర్ నేతలు చర్చిస్తున్నారని టాక్. అయితే సిఫార్సు ఇంకా ఫైనలైజ్ కాలేదని, పీసీసీ, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.