iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై అసంతృప్త జ్వాలలు.. కష్టాలు తప్పవంటూ..

  • Published Oct 28, 2023 | 4:19 PM Updated Updated Oct 28, 2023 | 4:19 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభ్యర్థుల జాబితాలు విడుదల చేసిన వెంటనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభ్యర్థుల జాబితాలు విడుదల చేసిన వెంటనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై అసంతృప్త జ్వాలలు.. కష్టాలు తప్పవంటూ..

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే రాజకీయ నేతల్లో సందడి మొదలైంది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు జోరందుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీ కండువ కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ బీఆర్ఎస్ తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదనతో కాంగ్రెస్, బీజేపీకి గుడ్ బై చెప్పి గులాంబీ కండువ కప్పుకుంటున్నారు కొంతమంది నేతలు. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్న చందంగా ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేయగానే వలసల పర్వం మొదలైంది. నిన్న కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ లో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో అసంతృప్తుల సెగ పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నామని.. మొదటి లిస్టులో టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది నేతలు.. సెకండ్ లిస్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిన్న రిలీజ్ అయిన సెకండ్ లిస్టు లో కూడా పేర్లు రాకపోవడంతో అధిష్టానంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది పార్టీ మారేందుకు తమ అనుచరులతో చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కొంతకాలంగా పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్ ఇచ్చారని పలువరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రి రేణుకా చౌదరి.. కాపు నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఇలా చేస్తే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జడ్చర్ల, నారాయణపేట టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ కి నిరాశ ఎదురైంది.

హీరో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి.. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. మొన్నటి వరకు ఊరిస్తూ వచ్చిన అధిష్టానం భూపతిరెడ్డికి కేటాయించడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  ఇటీవల కాంగ్రెస్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.  ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పి. విష్ణువర్ధన్ రెడ్డి కి తీవ్ర నిరాశ ఎదురైంది. మొదటి లిస్టు లో కాకపోయినా.. సెకండ్ లిస్టు లో వస్తుందని భావించిన విష్ణువర్ధన్ కి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి కేటాయించడంతో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత పీజేఆర్ కొడుకు విష్ణువర్థన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ వస్తున్నారు. డబ్బులు ఉన్న నేతలకు కాకుండా దమ్ము ఉన్న నేతలకు టికెట్ ఇవ్వాలని అసంతృప్తి నేతలు అధిష్టానంపై భగ్గుమంటున్నారు.

ఇక నిన్నటి వరకు మునుగోడు టికెట్ పై ఎన్నో ఆశలు పట్టుకున్న చలమల కృష్ణారెడ్డికి కాకుండా ఈ మద్య సొంతగూటికి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వనపర్తి,  ఈసారి జూనియర్లకు టికెట్లు ఇస్తామని అంతర్గతంగా చెప్పినప్పటికీ.. రెండవ జాబితాలో అంతా తమ ఇష్టానుసారంగానే ఫైనల్ చేశారని ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి,హుజురాబాద్, హుస్నాబాద్,దేవరకొండ, అంబర్ పేట్, మహేశ్వరం , మహబూబాబాద్, పాలకుర్తి, నర్సాపూర్ లాంటి కీలక నియోజకవర్గాల్లో టెకెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఏ క్షణంలో అయినా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఏది ఏమైనా ఎన్నికలు జరిగే వరకు తెలంగాణలో ఇంకా ఎన్ని రాజకీయసమీకరణాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.