iDreamPost
android-app
ios-app

ఆందోళ‌న‌ల న‌డుమ అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ కు అధికారిక గుర్తింపు

ఆందోళ‌న‌ల న‌డుమ అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ కు అధికారిక గుర్తింపు

నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లోనూ 306- 232 తేడాతో ట్రంప్‌నకు అందనంత దూరంలో నిలిచి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఆది నుంచి తన ఓటమిని అంగీకరించని ట్రంప్‌.. ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా ఆయ‌న‌కు చుక్క ఎదురైంది. అయినా ప‌ద‌వీ కాంక్ష తొల‌గ‌ని ట్రంప్ త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో బైడెన్‌ గెలుపును అధికారికంగా ధ్రువీకరించే అంశ‌మై చ‌ర్చించేందుకు కాంగ్రెస్ సభ భేటీ అవుతున్న క్ర‌మంలో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగ‌డంతో అమెరికా అట్టుడికింది.

అమెరికా ప్ర‌స్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌ భవనం (పార్లమెంటు)లోకి దూసుకువచ్చారు. బ్యారికేడ్లను దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు. నూతన ప్రెసిడెంట్‌గా డెమొక్రాట్‌ జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. క్యాపిటల్‌ భవనంలోని కిటికీలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు.‌ ఈ ఆందోళనల సందర్భంగా చెలరేగిన కాల్పుల కలకలంలో ఓ మహిళ మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆందోళనకారులు సంయమనం పాటించాలంటూ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు.

ఈ ఘటనపై అమెరికా చట్టసభ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సెనేటర్‌ మిచ్‌ మెకానెల్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటివేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘హింస ఎన్నటికీ గెలవదు. స్వేచ్ఛ మాత్రమే విజయం సాధిస్తుంది. ఇప్పటికీ ఇది ప్రజల సభ మాత్రమే’’ అని పేర్కొన్నారు. ఆందోళనకారుల చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.

క్యాపిటల్‌ బిల్డింగ్‌ (పార్లమెంటు)పై దాడిని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై జరిగిన దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు. అదే విధంగా ప్రస్తుత ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ వెంటనే జాతిని ఉద్దేశించి ప్రసంగించాలని, క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన తన మద్దతుదారులను వెనక్కి పిలవాలని డిమాండ్‌ చేశారు. హింసకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘‘క్యాపిటల్‌ బిల్డింగ్‌లోకి దూసుకురావడం, కిటికీలు పగులగొట్టి అమెరికా సెనేట్‌ను ఆక్రమించడం… చట్టబద్ధంగా ఎన్నికైన అధికారులను బెదిరింపులకు గురిచేయడం? దీనిని నిరసన అనరు.. ఇది కచ్చితంగా తిరుగుబాటు’’ అని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్రోహ చర్యలను ఇప్పటికైనా ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. క్యాపిటల్‌ భవనంపై డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారుచేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు.

జో బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు డొనాల్డ్‌ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు ఎంత ప్ర‌య‌త్నించినా అవి ఫ‌లించ లేదు. అమెరికా కాంగ్రెస్‌ బైడెన్‌ గెలుపుని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నెల 20 ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసింది. ఇక ఎన్నికల్లో డెమొక్రాట్లకు మద్దతుగా 306 ఓట్లు.. రిపబ్లికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా 232 ఓట్లు వచ్చాయని ఎలక్టోరల్‌ కాలేజీ‌ ప్రకటించింది. రిపబ్లికన్‌ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఈ ఫలితాన్ని ధ్రువీకరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా మంత్రిమండలి సిద్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోందని, విచక్షణ కోల్పోయి ఆందోళనకు కారణమైన ట్రంప్‌ ఏ క్షణంలోనైనా పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని రిపబ్లికన్‌ నాయకులు అన్నట్లు సీఎన్‌ఎన్‌ కథనం వెలువరించింది. కాగా జనవరి 20 బైడెన్‌ పదవీ స్వీకార ప్రమాణానికి అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నారు.