iDreamPost
android-app
ios-app

తిరుపతికి కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు రావడం లేదా..?

తిరుపతికి కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు రావడం లేదా..?

ఈ నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ తరఫున మంత్రులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరఫున ఇప్పటికే లోకేష్‌ తిరుపతికి వచ్చారు.. త్వరలో చంద్రబాబు రాబోతున్నారు. యనమల, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు వంటి నేతలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునిల్‌ దేవధర్, ఎంపీ జీవీఎల్‌ నరశింహారావు తిరుపతిలో మకాం వేశారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వచ్చారు. త్వరలో బండి సంజయ్, రాజా సింగ్‌లు ఢిల్లీ నుంచి జేపీ నడ్డా సహా పలువురు పెద్ద తలకాయలు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే కాంగ్రెస్‌ తరఫున మాత్రం అభ్యర్థి చింతా మోహన్‌ ఒక్కడే ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్ధతుగా ఏపీ కాంగ్రెస్‌లో పేరొందిన నేతలు కూడా ప్రచారం చేసేందుకు రావడం లేదు. ఏపీ కాంగ్రెస్‌ ఇంఛార్జి ఎవరో కూడా తెలియడం లేదు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి, ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్‌లు తిరుపతి వైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే వీరు ఏదో ఒక అంశంపై తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. ఇక ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్‌ పెద్దలు ఎవరూ ప్రచారానికి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలకు కొదవే లేదు. అయితే వీరెవరూ తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టకపోవడం విశేషం. ఏపీ రాజకీయాలంటే ఎప్పుడూ ఆసక్తి కనబర్చే తెలంగాణ నేత వీహెచ్‌ హనుమంతరావు కూడా ఈ సారి ఈ వైపు చూడడం లేదు. ప్రచారానికి రావాలంటూ వీరెవరినీ అభ్యర్థి చింతా మోహన్‌ ఆహ్వానిచలేదా..? లేక ఫలితం ఎలా ఉంటుందో తెలిసిన ఎన్నికల్లో ప్రచారం చేయడం ఎందుకని ఊరుకున్నారో..? మొత్తం మీద ప్రజలకు ముఖ పరిచయం ఉన్న కాంగ్రెస్‌నేతలు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కనిపించే సూచనలు లేవు.

పేరొందిన నేతలు కాకపోయినా ప్రచారానికి కొంత మందిని పంపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఉప ఎన్నికకు 13 మందితో కూడిన ప్రచార బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, తిరుపతి నగర అధ్యక్షురాలు కిడాంబి ప్రమీలమ్మ, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు సీహెచ్‌ దేవకుమార్, చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు బీఆర్‌ సురేష్‌బాబు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి డి.రాంభూపాల్‌ రెడ్డి, చిత్తూరు నగర అధ్యక్షుడు జి.తుకారం, రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడు పి.రాకేష్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుయాదవ్, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పెనుబాల చంద్రశేఖర్, జి.చిట్టిబాబు, టి.వెంకట నరసింహులు, యర్లపల్లి గోపీ, మాగటి గోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ఈ 13 మందిలో సుంకర పద్మశ్రీ అప్పుడప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో మీడియాలో కనిపిస్తుంటారు. ఇక మిగతా వారికి ముఖ పరిచయం కూడా లేదు.

Also Read : తమిళనేతలను తలదన్నేలా చింతామోహన్‌ హామీలు