P Krishna
P Krishna
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తమ సత్తా చాటుకొని అధికారం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు గట్టి పట్టుమీద ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తరుపు నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాహుల్, ప్రియంక గాంధీలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సీనియర్ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ బుధవారం రాత్రి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా మల్లు నియామకంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
ఓ వైపు తెలంగాణలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో మునిగిపోయారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మద్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అండగా నిలుస్తున్న మల్లు ఇంద్రసేనారెడ్డిని అనూహ్యంగా త్రిపుర గవర్నర్ గా నియమించడంపై చర్చలు నడుస్తున్నాయి. అయితే గవర్నర్ గా మల్లు ఇంద్రసేనారెడ్డి నియామకం పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పీసీపీ ఎన్నికల కమిటీ చైర్మన్ అయిన నిరంజన్.. సీఈసీ రాజీవ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్రం నుంచి సీనియర్ నేతను గవర్నర్ గా నియమించడం సరికాదని.. ఇది ఓటర్లను ప్రభావితం చేసేలా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే మల్లు ఇంద్రసేనా రెడ్డిని గవర్నర్ గా నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని సీఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రసేనా రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగా పాల్గొని మలక్ పేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను త్రిపుర రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారు. ఇప్పటికే బీజేపీ నేతలు అయిన సీహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్ గా పనిచేశారు. ప్రస్తుతం బండారు దత్తాత్రేయలు హర్యాన గవర్నర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.