పీకే నివేదికపై కాంగ్రెస్ కమిటీ రిపోర్టు .. సోనియా ఏమి చేయబోతున్నారు..?

కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ కీలకంగా మారింది. ఇప్పటికే పార్టీ పూర్వవైభవం కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన కాంగ్రెస్ కమిటీ అధినేత్రికి రిపోర్టు ఇచ్చింది.ఇక దీనిపైన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో కీలక సమావేశం జరిగింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీలో చేరే విషయం, ఇప్పటికే ఆయన ఇచ్చిన నివేదికపై భేటీలో సీరియస్​గా చర్చించారు. పీకే పార్టీలో చేరితే.. అప్పగించాల్సిన బాధ్యతలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. సీనియర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో..పార్టీ అధినేత్రి సోనియా – రాహుల్ మరోసారి ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయి..ఆయన చేరిక – బాధ్యతల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో భవిష్యత్తులో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు’సాధికారత చర్య బృందం-2024′ ను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధినేత్రి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ చింతన్ శిబిర్​కు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్ వేదిక కానుంది. వచ్చేనెల 13, 14,15 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఆహ్వానితులు మొత్తం 400మందికిపైగా చింతన్ శిబిర్​లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, వాటి వల్ల సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు, రైతుల సమస్యలు సహా ఇతర కీలక విషయాలపై కాంగ్రెస్ చర్చించనుంది.

పీకేకు కాంగ్రెస్ సీనియర్ల షరతు, ఒప్పుకుంటేనే ఎంట్రీ..అంతేగాకుండా రైతులు, రైతు కూలీలు, ఎస్‌సీ, ఎస్​టీ, ఓబీసీ, మత, భాషా మైనారిటీలు, మహిళా సామాజిక న్యాయం, సాధికారత, యువత సంక్షేమం, శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై సవివరంగా చర్చించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అందులో భాగంగా.. ఆరు ఎజెండాలకు సంబంధించిన ఆరు కమిటీల జాబితాను విడుదల చేశారు. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్, యూత్ అండ్ అన్‌ఎంప్లాయిమెంట్, ఆర్గనైజేషనల్ అఫైర్స్, సోషల్ ఎన్విరాన్‌మెంట్, ఎకనామిక్ స్టేట్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలుగా వీటికి నామకరణం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కమిటీలకు మల్లిఖార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, భూపిందర్ సింగ్ హూడా, అమరీందర్ సింగ్ వారింగ్‌లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.

Show comments