iDreamPost
android-app
ios-app

బ్యాంకు మోసగాళ్ల కోసం బీజేపీ పథకం.. లూటీ చెయ్యి.. పారిపో..!

బ్యాంకు మోసగాళ్ల కోసం బీజేపీ పథకం.. లూటీ చెయ్యి.. పారిపో..!

బ్యాంకుల మోసం కేసులో అతిపెద్దదైన ఏబీజీ షిప్‌యార్డ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

బ్యాంకులకు ఎగనామం పెట్టేవారి కోసం బీజేపీ ప్రభుత్వం ‘లూటీ చెయ్యి.. పారిపో’ అనే పథకాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ధ్వజమెత్తారు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా, జతిన్‌ మెహతా, చేతన్‌, నితిన్‌ సందేసారా.. ఇలా అనేక మంది బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి మోదీ హయాంలోనే విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. తాజాగా ఏబీజీ కంపెనీ మాజీ సీఎండీ రిషి కమలేశ్‌ అగర్వాల్‌, మరికొంత మంది ఈ జాబితాలో చేరారని చెప్పారు. వీరందరూ ‘రత్నా’లని ఎద్దేవా చేశారు.

ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ దేశంలోనే అతిపెద్ద మోసానికి పాల్పడింది. బ్యాంకులకు రూ.22,842 కోట్లకు టోపీ పెట్టింది. 28 బ్యాంకులను మోసగించిన ఆ కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఎన్‌సీఎల్‌టీ 2017లోనే ఏబీజీ షిప్‌యార్డ్‌ లిక్విడేషన్‌ను ప్రారంభించింది. కాగా, కంపెనీలో మోసం జరిగే అవకాశం ఉందని 2018లో కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించిందని సూర్జేవాలా గుర్తుచేశారు. 2019లో ఎస్‌బీఐ కూడా ఏబీజీ ప్రమోటర్లపై సీబీఐకి ఫిర్యాదు చేసిందన్నారు. మళ్లీ 2020,ఆగష్టులో కూడా ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఏబీజీ లిక్విడేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఐదేళ్లు ఎందుకు పట్టిందని సూర్జేవాలా ప్రశ్నించారు.

ఎస్‌బీఐ రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని సీబీఐ.. చివరికి ఈ నెల 7న ఏబీజీ కంపెనీ, సీఎండీ రిషి కమలేశ్‌ అగర్వాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. మోదీ సర్కారు హయాంలో ఏడున్నరేళ్లలో మోసగాళ్లు బ్యాంకులకు రూ.5.35 లక్షల కోట్ల మేరకు టోపీ పెట్టారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత భారీ మోసాలు ఎన్నడూ జరగలేదన్నారు.

యూపీఏ హయాంలోనే : బీజేపీ

ఏబీజీ షిప్‌యార్డ్‌ సంస్థ మోసాలపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. యూపీఏ హయాంలోనే ఇలాంటి సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చారని, మోదీ సర్కారు ఆ మోసాలను వెలుగులోకి తెస్తోందని తెలిపింది. కాంగ్రెస్‌ విమర్శలు చూస్తుంటే.. దొంగే పోలీసులపై ఆరోపణలు చేసినట్లుగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం ఎద్దేవా చేశారు. ఇలాంటి రుణాలన్నీ 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందే ఇచ్చినవని, అప్పటికే బ్యాంకులు వాటిని నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చాయని చెప్పారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ మోసాలను వెలుగులోకి తీసుకొస్తున్నామని, ఆర్థిక నేరాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని సర్కారు ‘ఫోన్‌ బ్యాంకింగ్‌’ కుంభకోణాన్ని నడిపిందని ఆరోపించారు. నాటి ప్రభుత్వంలోని పెద్దలు ఆయా కంపెనీల ప్రమోటర్ల నుంచి వచ్చే కమీషన్ల కోసం.. బ్యాంకర్లపై ఒత్తిడి చేసి మరీ రుణాలు ఇప్పించారన్నారు. ఈ మోసాలన్నింటికీ కాంగ్రెస్‌దే బాధ్యత అన్నారు. బ్యాంకులు లోన్లు ఇచ్చే విషయంలో నరేంద్ర మోదీ సర్కారు ఏ మాత్రం కల్పించుకోదని స్పష్టం చేశారు.

Also Read :  దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఫ్రాడ్ కేసు.. సీబీఐ చరిత్రలో ఇదే మొదటి సారి?