iDreamPost
iDreamPost
ఏపీ రాజధాని అంశంలో బీజేపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఆపార్టీ నేతలు ఇప్పుటికే తలోదారిన వ్యవహరిస్తన్నారు. కేంద్రంలోని పెద్దల వ్యవహారానికి ఏపీలోని బీజేపీ నేతల తీరుకి పొంతన ఉన్నట్టు కనిపించలేదు. దాంతో రెండు నాలుకల వ్యవహారం సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆపార్టీ వ్యవహారం ఉండడంతో ఆశించిన ఫలితాలు రాకపోగా బీజేపీ మీద ప్రజల్లో అపోహలు పెరిగాయి. చివరకు అమరావతిలో ఉద్యమిస్తున్న వారు కూడా కమలం నేతలను విశ్వసించే పరిస్థితి కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి కన్నా లక్ష్మీనారాయణ ఆందోళనకు పూనుకోవడం, నేరుగా రాజధాని ఆందోళనలో భాగస్వామి కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మూడు రాజధానుల అంశంలో బీజేపీ నుంచి మూడు రకాల స్వరాలు వినిపించాయి. రాజధాని అంశం కేంద్రానికి సంబంధం లేదు కాబట్టి మేము మాట్లాడబోమని కొందరు నేతలు, అమరావతి నుంచి మారిస్తే అసలు సహించేది లేదని కొందరు, అమరావతిలో అతి పెద్ద కుంభకోణం జరిగిందంటూ మార్చినా అభ్యంతరం లేదనే పరోక్ష సంకేతాలతో ఇంకొందరు వ్యవహరించారు. చివరకు పార్లమెంట్ సాక్షిగా బీజేపీ తన వైఖరిని వెల్లడించడంతో ఇంకా సర్థుముణుగుతున్నట్టు గా కనిపించింది. భిన్న స్వరాల బీజేపీ నేతల గొంతు సవరించుకుంటారని అంతా ఆశించారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఢిల్లీ దారి ఢిల్లీదే..అమరావతిలో మాత్రం మా వైఖరి మారదన్నట్టుగా మాట్లాడడం విశేషంగా మారుతోంది.
అమరావతి నుంచి అంగుళం కూడా కదలించలేరని వ్యాఖ్యానించిన సుజనా చౌదరి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఉద్యమం తొలినాళ్లలో ఉద్దండరాయుని పాలెం వద్ద మౌనదీక్షకు పూనుకున్న కన్నా కూడా కొంత మౌనంగానే ఉన్నారు. బీజేపీ తో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ కూడా రాజధాని విషయంలో కేంద్రాన్ని నిందించకూడదని, కొన్ని అంశాలు రాష్ట్రాల హక్కులని కూడా బోధపడిందని బాహాటంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో లాంగ్ మార్చ్ కూడా ప్రకటించి, చేతులెత్తేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా కన్నా సీన్ లోకి ఎందుకొచ్చారన్నదే ప్రశ్నార్థకంగా మారుతోంది. అమరావతి ప్రాంతంలో బీజేపీ నేతల మధ్య తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత పెద్ద పెద్ద మాటలు చెప్పి, ఇప్పుడు పూర్తిగా దూరం కావడాన్ని అనేక మంది ప్రశ్నించినట్టు కనిపిస్తోంది. దాంతో వారిని సంతృప్తి పరిచే లక్ష్యంతో కన్నా మళ్లీ సీన్ లో కనిపించినట్టుగా భావిస్తున్నారు. తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో ఆయన పర్యటించి , విశాఖ విషయంలో జగన్ మీద విమర్శలు గుప్పించడానికి అదే కారణంగా అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో రాజధాని విషయంలో ప్రభుత్వం కూడా ఇటీవల పెద్దగా ప్రకటనలు చేస్తున్న దాఖలాలు లేవు. మంత్రులు గానీ ఇతరులు గానీ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. జగన్ నేరుగా మోడీతో భేటీ అయిన తర్వాత ఈ విషయంలో కదలిక కనిపించడం లేదు. దానికి కారణాలు ఏమిటన్నది కూడా ఓ ప్రశ్నగా ఉంది. అయితే ఇళ్ల స్థలాల పంపిణీ మీద కేంద్రీకరించిన జగన్ ప్రాధాన్యతలు మారడంతోనే ప్రభుత్వం పూర్తిగా అటు దృష్టి సారించిందని కొందరు చెబుతున్నారు. ఉగాది తర్వాత మార్పు అనివార్యంగా భావిస్తున్నారు. అలాంటి సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు అమరావతి ఉద్యమం గురించి మాట్లాడడం ద్వారా ఏం సాధిస్తారన్నది చర్చనీయాంశం అయ్యింది. అదే సమయంలో అమరావతి ఉద్యమంలో తొలుత కీలకంగా వ్యవహరించిన టీడీపీ ప్రస్తుతం తానేమీ చేయలేనని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు కూడా ఈ విషయంలో పెద్దగా మాట్లాడుతున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఇతర ప్రాంతాల నేతల నుంచి ఒత్తిడి పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ తరుణంలో అమరావతి ఉద్యమంలో ఖాళీ అవుతున్న ప్రాంతాన్ని తాము కవర్ చేయాలనే లక్ష్యంతోనే కమలం నేతలు ఇలాంటి ప్రయత్నాలకు సన్నద్ధమతున్నట్టు సందేహిస్తున్నారు. అది సాధ్యమా, కాదా అన్నది పక్కన పెడితే ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేస్తున్న వ్యవహారంలో అమరావతి ప్రాంత ప్రజలు మాత్రం పావులుగా మారిన పరిస్థితి సుస్పష్టం.