Idream media
Idream media
ప్రజలందరూ ఇప్పుడు ఆపదలో ఉన్నారు. ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తోంది. అలాగే కామ్రేడ్లు కూడా సీపీఎం కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు సేవలందిస్తున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో దాదాపు 100 మంది కొవిడ్ రోగులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక రాష్ట్రంలోని కొన్ని కార్యాయాల్లో కూడా 30 మంది 100 మంది వరకు ఆశ్రయం కల్పిస్తోంది. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రభుత్వాన్ని ఆరోపించడం మినహా కరోనా కాలంలో ప్రజకు అందిస్తున్న సేవలు పెద్దగా కనిపించడం లేదు.
ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పానికి మాత్రమే సహాయపడుతూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపై చిన్న చూపు చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ పరిణామాలను గమనిస్తున్న నెటిజన్లు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాటలతో కాలం గడుపుతోందని, ఎక్కడా సహాయక చర్యలు కానీ, కార్యక్రమాలు కానీ.. నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు.
ప్రస్తుతం ప్రజలకు రాజకీయ నేతల నుంచి భరోసా ఎంతో అవసరం. ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలు తమ దగ్గరకు రావాలని, తమను ఆదుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం ఐసోలేషన్ సెంటర్లు, కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అధినేత చంద్రబాబునాయుడు కూడా జూమ్ మీటింగ్ లకే పరిమితం అవుతున్నారు కానీ నేరుగా రంగంలోకి దిగి ఎవరినీ ఆదుకున్న దాఖలాలు లేవు. కరోనా భయం ఉన్నప్పటికీ చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజా సేవలో పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
టీడీపీ గతంలో అయితే.. ఇసుక మద్యం వంటి అంశాలను తీసుకుని ఆందోళన చేసేది. అయితే.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో.. నేతలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. దీంతో ప్రజల పక్షాన పోరాడే నాయకులు ఎవరూ కూడా టీడీపీ నుంచి బయటకు రావడం లేదు. పార్టీ అధినేత సహా కొందరు మాత్రం మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు అనేసి చాప చుట్టేస్తున్నారు తప్ప.. తమను పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఆక్సిజన్ మరణాల విషయంలో కమ్యూనిస్టులు ఆందోళనకు సిద్ధమైనప్పటికీ.. టీడీపీ నేతలు రాలేదు. వైసీపీ మాత్రం దీనిపై చర్యలు చేపట్టింది. ఏదేమైనా ఎన్నికలు ఉనప్పుడు నానా హడావిడి చేసే టీడీపీ ఇప్పుడు ప్రజలు ఇంత అల్లకల్లోలంలో ఉంటే ఎవరో ఒకరిద్దరు తప్పా బయటకు వస్తోన్న పరిస్థితి లేదు.