Idream media
Idream media
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 27న ప్రారంభమైన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. సాధారణంగా మూడు సంవత్సరాలకు ఒకసారి సీపీఎం మహాసభలను నిర్వహించుకుంటుంది. గతేడాదిలో మహాసభలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నాలుగో సంవత్సరంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లలో పార్టీ చేసిన ఉద్యమాలపై సమీక్ష జరిపారు. మూడు రోజుల పాటు సాగిన మహాసభల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో స్థానం పొందిన పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు,మరింతగా నిలదొక్కుకోవాలంటే రూపొందించాల్సిన కార్యాచరణపై మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. కాగా, ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతు తెలపడంతో పాటు, పలు రంగాలపై తీర్మానాలు చేశారు.
ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు మతం, జాతి, ప్రాంతం పేరుతో విభజనలు తీసుకువస్తున్నారని మహాసభల ప్రారంభం రోజున సీపీఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా హిందుత్వ ఎజెండా అమలు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఎలా దాడులు జరుగుతున్నాయో.. అదే స్థాయిలో ప్రపంచ ఉద్యమాలు కూడా పెరుగుతున్నాయని.. ప్రపంచం కమ్యూనిజంవైపు చూస్తోందని, యాభై ఏళ్ల తర్వాత చిలీలో వామపక్ష నేత విజయమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మూడు రోజుల పాటు ఇలా పలు అంశాలపై చర్చలు, ప్రసంగాలతో సాగిన మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ మహాసభల్లో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పి. మధు కొనసాగగా ఇప్పుడు ఆయన స్థానంలో వి. శ్రీనివాసరావును ఎన్నుకున్నారు మహాసభలకు హాజరైన ప్రతినిధులు.. ఇకపై మధు స్థానంలో కార్యదర్శిగా శ్రీనివాసరావు కొనసాగనున్నారు.. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శి వర్గం చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 13 మందిని ఎంపిక చేశారు.. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చిన మాజీ ఎంపీ, సీనియర్ నేత పి. మధుతో పాటు.. మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య సహా ఐదుగురు నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వి. శ్రీనివాసరావు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో కింది స్థాయి నుంచి ఎన్నో పదవుల్లో కొనసాగిన ఆయన ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా కూడా కొనసాగారు. ఏపీ కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం మాట్లాడుతూ.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎదగడమే లక్ష్యంగా, నూతన కమిటీలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.