iDreamPost
iDreamPost
ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయం, ఎంతోమందికి ప్రశాంతతని చేకూర్చే దేవాలయం, ఎక్కువ ఆదాయం కలిగిన దేవాలయం తిరుమల శ్రీవారి ఆలయం. రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంతమందికి దర్శనం కల్పించడం, ఉచితంగా అన్నప్రసాద వితరణ, ప్రసాదాలు.. ఇవే కాక ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది TTD. TTDకి ఉన్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తుల వల్ల ప్లాస్టిక్ కూడా వచ్చి పడుతుంది. దీంతో ఆ తిరుమల పర్యావరణనికి, ప్రత్యేకతకి ముప్పు వాటిల్లుతుంది.
దీనిపై గతంలోనే TTD దృష్టి సారించి చర్యలు మొదలు పెట్టింది. తిరుమలలో దశల వారీగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గతంలోనే నిర్ణయించింది TTD. దీంట్లో భాగంగా తొలిదశలో శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండోదశలో కొండపై పూర్తిగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను నిషేధించారు. హోటళ్లు, మఠాల్లోను, స్థానిక నివాసితులు, షాపులలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించరాదని హెచ్చరించింది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా ఇప్పుడు మూడోదశలో కొండపైన పూర్తిగా ప్లాస్టిక్ ని నిషేదించనున్నారు. ఇందులో భాగంగా స్థానికులు, హోటళ్లు, దుకాణదారులతో అధికారులు సమావేశమై అధికారులు ఇకపై తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా దుకాణదారులు, మఠాలు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే లైసెన్స్ రద్దుచేసి, చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు వారు అమ్మే వస్తువులకు ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని, పేపర్ లేదా బయోడిగ్రేడబుల్ కవర్లు ఉపయోగించాలని తెలిపారు. షాంపూ పాకెట్స్ ని కూడా నిషేధించారు.
ఇక తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ వస్తువులను గుర్తించి డస్ట్‌బిన్లలో పడేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రకటనలు జారీ చేసింది TTD. తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలంటే టీటీడీకి సహకరించాలని భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమలకి వెళ్లే భక్తులు ఈ సూచనలు కచ్చితంగా తెలుసుకోవాలి.
#తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని టీటీడీ పూర్తిగా రద్దుచేసింది.
#అలిపిరి తనిఖీ కేంద్రం, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
# ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, షాంపు ప్యాకెట్లు తిరుమలకి తీసుకురావడం నిషిద్ధం.
#ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులని అస్సలు తిరుమలకు తీసుకురాకూడదు.