iDreamPost
android-app
ios-app

పుదుచ్చేరి కూటమిలో పీఠం కోసం పోటీ

పుదుచ్చేరి కూటమిలో పీఠం కోసం పోటీ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇప్పటి వరకూ గెలుపు కోసం పోరాడిన ఎన్డీయే కూటమిలో ఇప్పుడు కొత్త మొదలైంది. ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీకే కావాలని బీజేపీ నేతలు, సీఎం పీఠం వదులుకునేది లేదని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి పోటీ పడుతున్నారు. పీఠం కోసం అవసరమైతే బీజేపీని వదులుకుని డీఎంకే, కాంగ్రెస్‌ల మద్దతు కూడగట్టుకునేందుకు కూడా రంగస్వామి వెనుకాడడం లేదని తెలుస్తోంది.

అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్‌ల మద్దతు

30 మంది ఎమ్మెల్యేలున్న పుదుచ్చేరి శాసనసభకు ఇటీవల వెల్లడైన ఫలితాల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10 స్థానాలను, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్‌ 2, స్వతంత్రులు ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు (మ్యాజిక్‌ ఫిగర్‌) 16 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో ఎన్‌డీఏ కూటమిలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమైపోయింది. అయితే సీఎం పదవి తమకే కావాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికలు మొదలు నుంచే అడపాదడపా అంటూనే ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రిని తానేనని, ఇందుకోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని రంగస్వామి ప్రకటించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి రంగస్వామిని శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. అంతేగాక, అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్‌ల మద్దతు తీసుకునేందుకు కూడా రంగస్వామి సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

సీఎం పీఠంపై ఓకే కానీ..

పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన బీజేపీ వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రిగా రంగస్వామికి జై కొట్టింది. సోమవారం రంగస్వామితో కలిసి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్దకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని అభ్యర్థించింది. అందుకు గవర్నర్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఎన్‌డీఏలో సీఎం పీఠం వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో మళ్లీ లొల్లి మొదలైంది. ముఖ్యమంత్రి పదవి కోసం విఫలప్రయత్నం చేసి వెనక్కి తగ్గిన బీజేపీ, ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతోంది. అంతేగాక అసెంబ్లీ స్పీకర్‌ పదవితో పాటు రెండు మంత్రి పదవులు కూడా కావాలని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి ముందు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది.

నిజానికి పుదుచ్చేరిలో ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది లేదు. అయితే కేంద్ర హోంశాఖ అనుమతి ఇస్తే ఆ పదవిని సృష్టించవచ్చు. దీనికిగాను లెఫ్టినెంట్‌గవర్నర్‌ తమిళిసై కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాబోయే ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి.. శాసనసభ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి మంచి రోజు, సమయం చూసుకొని తెలియజేస్తామని రంగస్వామి చెప్పినట్టు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీనగానీ, లేక 9వ తేదీనగానీ రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.