iDreamPost
android-app
ios-app

రాముడి చుట్టూ రాజ‌కీయాలు

రాముడి చుట్టూ రాజ‌కీయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ఇప్పుడు ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ చ‌రిత్ర‌లోనే ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు చూసి ఉండ‌రు. ఆంజ‌నేయ స్వామి, న‌ర‌సింహ స్వామి, దుర్గ‌మ్మ‌.. ఇప్పుడు రాముడు. దేవుడు, దేవాల‌యాలు రాజ‌కీయాల‌కు వేదిక కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే.. ప్ర‌తిప‌క్షాల వ్యూహం వేరే ఉన్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం విజయనగరం జిల్లా రామతీర్థం వేదికగా శనివారం హైటెన్షన్ నెలకొంది. రామతీర్థం రామాలయంలోని రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు డిసెంబర్ 29న ధ్వంసం చేశారు. విగ్రహం శిరస్సు తొలగించారు. మరుసటి రోజు ఆ శిరస్సు కొండ సమీపంలోని కొలనులో లభ్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం పలువురు నేతలు రామతీర్థానికి క్యూ కట్టారు.

ఆల‌య ప‌రిర‌క్ష‌ణ యాత్రకు చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్ట‌డం ఈ హైటెన్ష‌న్ కు కార‌ణ‌మైంది. అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి అంటూ టీడీపీ అధినేత రామతీర్థం బ‌య‌లుదేరారు. విమానంలో విశాఖపట్నం వచ్చిన బాబు.. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో రామతీర్థం బయలుదేరారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం అక్క‌డు చేరుకున్నారు. చంద్రబాబు కంటే ముందే అక్కడకు వచ్చిన ఆయన జైశ్రీరాం అని నినాదాలు చేస్తూ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సైతం కొండ పైకి బిజేపి శ్రేణులని అనుమతించాలని కొండ కింద బైటాయించి ఆందోళన చేప‌ట్టారు. ఇలా నేతల పోటాపోటీ పర్యటనలతో రామతీర్థం రాజకీయపరంగా హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడకు వస్తుండటంతో భారీగా పోలీసులను మోహరించారు. ముందుజాగ్రత్తగా కొందరు టీడీపీ నేతలను ఇంట్లోనే నిర్బంధించారు. కాగా, ఈ ఘటనలో 32 మంది అనుమానితులను విచారించినట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు.

రెచ్చ‌గొడితే సహించ‌బోం..

రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుశ్చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘29న రామతీర్ధంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆ ముందు రోజు అంటే 28న విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందిని విచారిస్తున్నాం. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రామతీర్ధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.ఈ విషయంలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు