iDreamPost
iDreamPost
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్పుకుంటు వస్తున్నదే నిజమైంది. రాజధాని పేరిట రైతులని మోసం చేసి వేల ఎకరాల భూమిని తెలుగుదేశం నేతలు దోచుకున్న వైనం బట్టబయలైంది. రాజధానిపై లీకులిచ్చి అస్మదీయులకు అప్పనంగా 4.069.94 వేల ఎకరాలు కట్టబెట్టిన తీరు సాక్ష్యాలతో సహా బయటపడింది. తెలుగుదేశం నేతలు ఎంత బుకాయిస్తున్న పక్కా ఆధారాలతో జగన్ సర్కార్ అవినీతి పుట్టని పెకిలించటానికి సిద్దమైంది. ఈ కుంభకోణంతో ప్రపంచ రాజధాని అంటూ ఒకవైపు ప్రజలు ఊహల్లో తేలేలా చేసి గుట్టు చప్పుడు కాకుండా రాజధాని చుట్టూ వేల ఎకరాల భూమిని బినామీల పేరుతో కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేసినటు స్పష్టం అవుతున్నది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై విచారణకు మంత్రులు, కన్నబాబు, పెద్దిరెడ్డి, గౌతం రెడ్డి, అనిల్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిల నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ సబ్ కమిటి రాజధాని భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగిందని ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. ఈ నివేదిక ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తేది 2014 జూన్ 8 నుంచి, అమరావతిని రాజధానిగా ప్రకటించిన తేది 2014 డిసెంబర్ 31 మధ్య సుమారు 4.069.94 వేల ఎకరాల భూమిని ఇన్సైడర్ ట్రేండింగ్ ద్వారా తెలుగుదేశం సంబంధిత పెద్దలు కొల్లగొట్టరని పూర్తి వివరాలతో నివేదక రూపొందించింది. ఈ నివేదికలో తెలుగుదేశం అగ్రనేతలతో పాటు వారి బినామీలు బంధువులు ఉండటం చూస్తే ఎంత ప్రణాళికాబద్దంగా భూ దోపిడికి పథక రచన చేశారో అర్ధం అవుతుంది.
ఈ కుంభకోణంలో కొందరు చట్టవిరుద్దంగా వెనకబడిన వర్గాలకు చెందిన అసైండ్ భూములు కొంటే , మరికొందరు రైతుల దగ్గర అతి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి డెవలెప్మెంట్ కి ఇచ్చి అందులో ప్రభుత్వం ఇచ్చే కమర్షియల్ భూమిని చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు. ఇంకొంతమంది సరిగ్గా ప్రభుత్వం నిర్దేశించిన సి.ఆర్.డి.ఏ సరిహద్దుకు అవతల కొన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక ప్రకారం ఇలా వివిధ రూపాల్లో భూ దోపిడికి పాల్పడిన వారిలో చంద్రబాబు నివాసం కొరకు కరకట్టపై ఉన్న తన సొంత ఇంటిని ఇచ్చిన లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లమీద భూములు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఇవి సుమారు 800 ఎకరాలు ఉండొచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బినామీ సంస్థ అభినందన హౌసింగ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు, మాజీ మంత్రి నారాయణ తన దగ్గర పని చేసే, అవుల ముని శంకర్, వరుణ్ కుమార్, ప్రమీళ, సాంబశివరావు పేర్లతో 55.27 ఎకరాలు, బినామీ గుమ్మడి సురేష్ పేరుతో పత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వేమూరి రవి కుమార్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కంస్ట్రక్షన్స్, గోష్పదీ గ్రీన్ ఫీల్డ్ లాంటి బినామీ వ్యక్తులు , సంస్థల పేరిట 62.77 ఎకరాలు, మైత్రి ఇన్ఫ్రా పేరుతో రావెల కిషోర్ బాబు బినామీలకు 40.85 ఎకరాలు, శశి ఇన్ఫ్రా మాజీ స్పీకర్ కోడెల బినామీలకు 17.13 ఎకరాలు, ఇంకా పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జి.వి.యస్ ఆంజినేయులు, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, కంభంపాటి రామోహన్ , లంకా దినకర్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ కూడా అమరావతిలో భూములు ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది.
రాజధాని అంటూ కొంతమంది రైతులు స్వచ్చందంగా ఇచ్చినా కొంతమంది రైతులు తమ భూములని ప్రభుత్వానికి ఇవ్వటానికి నిరాకరించటంతో, రైతులను బెదిరించి వారి నుంచి భూములను భయపెట్టి గుంజుకున్న విషయం తెలిసిందే. మరో పక్క తన అస్మదీయుల చేత రాజధాని ప్రకటన రాకముందే భూములు కొనుగోలు చేయించి దేశంలో ఎక్కడా జరగనంత భారీ భూ కుంభకోణానికి తెరలేపింది. గత ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం చెబుతున్న ఈ 4.069.94 వేల ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ అయినవి మాత్రమ్రే, ఇంకా లోతుగా విచారణ జరిపితే జి.పి.ఏ గా రిజిస్టర్ చెసిన అనేక భూ విక్రయ లావాదేవీలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం సి.బి.ఐ, లోకాయుక్త లాంటి సంస్థల చేత పూర్తి స్థాయిలో ఈ భారీ కుంభకోణాన్ని దర్యాప్తు చేసి నష్టపోయిన రైతులుకి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.