iDreamPost
android-app
ios-app

ఎన్నికల ప్రచారం.. నూతన ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

ఎన్నికల ప్రచారం.. నూతన ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

ఎన్నికల ప్రచారం అంటే.. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో హోరెత్తిపోతుంది. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ.. ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ నేతలు దుమ్మెత్తిపోసుకుంటారు. కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు సర్వసాధారణం. మీడియాకు బోలెడు వార్తలు. ఏళ్లతరబడి సాగుతున్న ఈ విధానానికి వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ చెక్‌ పెట్టారు. సరికొత్త విధానానికి తెరతీశారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఈ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని కుటుంబాలకు లేఖలు రాశారు. 21 నెలల తన పాలనలో సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధిని ఆ లేఖలో వివరించారు. పథకాలతోపాటు పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలు, రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలను సీఎం వైఎస్‌ జగన్‌ తన లేఖలో పొందుపరిచారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంతకంతో కూడిన ఈ లేఖలను లోక్‌సభ పరిధిలోని ప్రతి కుటుంబానికి పంపనున్నారు. తొలి లేఖపై సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు సంతకం చేశారు.

21 నెలల తన ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ లబ్ధి, అభివృద్ధిని గురించి వివరించిన సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతిలో వైసీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆ లేఖలో కోరారు. దేశ చరిత్రలో ఎన్నికల సందర్భంగా ఓ ప్రభుత్వ అధినేత ప్రజలను ఇలా మద్ధతు అడగడం తొలిసారి. ప్రధానులు గానీ, ముఖ్యమంత్రులు గానీ ఇప్పటి వరకు తాము ప్రజలకు చేసిన మంచిని, అభివృద్ధిని రాతపూర్వకంగా వివరిస్తూ ఓట్లు అడిగిన సందర్భం ఏడు దశాబ్ధాల స్వతంత్ర భారతంలో లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Also Read : జగన్‌కు అంత క్రేజ్‌..! అందుకేనా..?

సాధారణంగా ప్రధానులు, ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో.. తాము అన్ని హామీలు అమలు చేశామని, ఆ పథకం ద్వారా మేలు చేశామని, ఈ అభివృద్ధి చేశామని, దేశం వెలిగిపోతోందని.. రకరకాలుగా ఉపన్యాశాలు ఇవ్వడం ఇప్పటికీ చూస్తున్నాం. కానీ ఇందుకు భిన్నంగా చేసిన మంచిని రాతపూర్వకంగా తెలియజేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ప్రజలకు మంచి చేశాననే నమ్మకం సదరు నేతకు ఉండాలి.

అర్హతే ఆధారంగా చోటా మోటా నేతలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు జగన్‌ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా అందిస్తోంది. ఈ నమ్మకం, ఆత్మ విశ్వాసమే సీఎం వైఎస్‌ జగన్‌ చేత ప్రజలకు లేఖ రాయించిందని చెప్పవచ్చు. మరో మూడేళ్లలో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ తన ప్రభుత్వం చేసిన మంచిని రాతపూర్వకంగా వివరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లేఖలు రాస్తారనడంలో సందేహం లేదు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచార వేళ సీఎం వైఎస్‌ జగన్‌ అనుసరించిన ఈ విధానం ప్రతిపక్ష పార్టీ నేతలను ఢీలా పడేలా చేసింది. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ జరగబోతోంది. అంతకు రెండు రోజుల ముందే.. అంటే ఈ నెల 15వ తేదీ లోపే ఈ లేఖలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కుటుంబానికి చేరనున్నాయి.

Also Read : పంచ్ ప‌డుద్ది : తిరుప‌తి ఎన్నిక‌ల రంగంలోకి జ‌గ‌న్