Idream media
Idream media
విద్యార్థి ప్రతిభకు కొలమానం మార్కులు. పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా విద్యార్థుల్లో ప్రతిభ ఎంత ఉందనేది వెల్లడవుతుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరీక్షలు లేకుండా పాస్ చేయిస్తే.. ఆ విద్యార్థికి తీరని అన్యాయం చేసినట్లేనని సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా జూమ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పరీక్షలు రద్దు చేయాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయించారు.
అయితే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకు జరిగే నష్టంపై సీఎం వైఎస్ జగన్ వ్యక్తం చేసిన ఆందోళన నిజమైనదేనని తాజాగా పంజాబ్‌లోని గురునానక్ యూనివర్సిటీ విద్యార్థులు విషయంలో స్పష్టమైంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉన్నత ఉద్యోగాలు పొందిన పట్టభద్రులు.. కరోనా సమయంలో పరీక్షలు లేకుండా పై తరగతులకు వెళ్లడం వల్ల ఇప్పుడు ఆ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించిన అధ్యాపకులు.. వారికి కొన్ని పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపారు. మరికొన్ని పరీక్షలు ఈ మెయిళ్ల ద్వారా నిర్వహించారు. ఈ విధానం వల్ల బాగా చదివే విద్యార్థులు నష్టపోయారు. పట్టభద్రులైన 300 మంది విద్యార్థులకు సంబంధించి అన్ని సెమిస్టర్ల మార్కులు లేవు. తీరా ఇప్పుడు ఉద్యోగ నియామకాలకు వచ్చే సరికి కంపెనీలు విద్యార్థుల అన్ని సెమిస్టర్ల మార్కులు చూపాలంటూ పట్టుబడుతున్నాయి. మార్కులు లేకుండా వారి ప్రతిభకు కొలమానం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో 300 మంది పట్టభద్రులు భవిష్యత్ అయోమయంగా తయారైందని గురునానక్ యూనివర్సిటీ అధికారులే స్వయంగా ఓ ప్రకటనను విడుదల చేయడం పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను తెలుపుతోంది.
గురునానక్ యూనివర్సిటీ వ్యవహారం చూసైనా.. పది, ఇంటర్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నారా లోకేష్ ఇతర ప్రభృతుల మనస్సు మారుతుందా..? లేదా.. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు విద్యార్థుల భవిష్యత్‌పై కూడా రాజకీయం చేస్తారా..? వేచి చూడాలి.
Also Read : జగన్ పాలనకు 100 మార్కులు తెచ్చిపెట్టిన 30 రోజుల నిబంధన