iDreamPost
android-app
ios-app

అది నా బాధ్యత : సీఎం వైఎస్‌ జగన్‌

అది నా బాధ్యత : సీఎం వైఎస్‌ జగన్‌

కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడం తన బాధ్యతని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకే తనకు ఓటు వేయనివారైనా సరే.. అర్హత ఉంటే.. వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని చెప్పినట్లు జగన్‌ తెలిపారు. మహా యజ్ఞంలా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అర్హత ఆధారంగా, రూపాయి తీసుకోకుండా ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు విజయనగరం జిల్లాలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 12,301 ప్లాట్లతో వేసిన భారీ లే అవుట్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

పాదయాత్రలో ఇళ్లు లేని పేదలను, కష్టాలుపడుతున్న అక్కచెళ్లెమ్మలను చూశానన్న సీఎం వైఎస్‌ జగన్‌ వారి బతుకులు మారాలని, వారిలో చిరునవ్వులు చిందాలనే ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామనే హామీ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఇళ్ల స్థలంతోపాటు 1.80 లక్షల రూపాయల విలువైన ఇళ్లును కూడా ఉచితంగా కట్టించి ఇవ్వబోతున్నట్లు చెప్పారు. రాబోయే సంక్రాంతికి ముందే ఇళ్ల పట్టాల రూపంలో ప్రజలకు బహుమతులు అందిస్తున్నట్లు అభివర్ణించారు.

గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో మొక్కుబడిగా కొన్ని ఇళ్లు కట్టి ఉండవచ్చని కానీ తమ ప్రభుత్వం గ్రామాలు, నగరాలను కడుతోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రతి లే అవుట్లో వందలు, వేలాది ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాలు, చిన్నస్థాయి నగర పంచాయతీలు కొత్తగా వెలుస్తున్నాయని వివరించారు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల కల్పనకు 7 వేల కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. 30.75 లక్షల ఇళ్లకు గాను 15.60 లక్షల ఇళ్లను కట్టించడం ప్రారంభించామని, వచ్చే ఏడాది రెండో దశలో మిగిలిన ఇళ్లు కట్టడం ప్రారంభిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

చంద్రబాబు, ఆయన సహచరులు కలసి కోర్టుల ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకులు సృష్టించారని సీఎం జగన్‌ మండిపడ్డారు. స్థలం, ఇళ్లు ఆస్థిలాగా, అవసరమైతే బ్యాంకులో తాకట్టుపెట్టుకుని రుణం తీసుకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇద్దామని సంకల్పిస్తే.. చంద్రబాబు న్యాయ చిక్కులు వచ్చేలా పిటిషన్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత 30.75 లక్షల మందికి డి పట్టాల స్థానంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.