Idream media
Idream media
వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన జగన్.. ఈ రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన సీఎం జగన్.. ఉదయం తిరుపతిలోని కృష్ణానగర్‌లో పర్యటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు.
కృష్ణానగర్‌లో దాదాపు మూడు గంటల పాటు ఉన్న సీఎం జగన్.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించారు. వారి సమస్యలు ఆలకించారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసి వరద ప్రభావంపై ఓ అంచనాకు వచ్చారు.
కృష్ణానగర్ పర్యటన తర్వాత సీఎం జగన్.. తిరుచానూరులో పర్యటిస్తున్నారు. స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చడంతో తిరుచానూరును వరద ముంచెత్తింది. వరద వల్ల కొట్టుకుపోయిన తిరుచానూరు – పాడిపేట బ్రిడ్జిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో వరద బీభత్సాన్ని అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించడం ద్వారా సీఎం జగన్ తెలుసుకున్నారు.
తిరుచానూరు తర్వాత సీఎం జగన్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నా ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కొవ్వూరు పట్టణం, నెల్లూరు సిటీలోని కొన్ని ప్రాంతాలు వరద తాకిడికి గురయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన పరిస్థితిని సీఎం జగన్ స్వయంగా పరిశీలించనున్నారు.
ఇప్పటికే వరద బాధితులకు అందిస్తున్న పరిహారానికి అదనంగా.. సీఎం జగన్ తన పర్యటనలో బాధితులకు మరింత భరోసా కల్పించేలా మరికొన్ని హామీలు ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి 3 లేదా 5 సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఏడాది పాటు రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు హెక్టారు (దాదాపు రెండున్నర ఎకరాలు)కు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ మొదటి రోజు పర్యటనలో హామీ ఇచ్చారు.
Also Read : CM Jagan, PRC – ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు