Idream media
Idream media
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ దేశ రాజధానిలో తీరకలేకుండా గడుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరి హస్తినకు వెళ్లిన వైఎస్ జగన్.. సాయంత్రం కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవడేకర్, గజేంద్ర షెకావత్‌లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న వైఎస్ జగన్.. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై జలశక్తి మంత్రి షెకావత్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవరించిన అంచనాలు 55,656.87 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని విన్నవించారు. జూన్ 2022 నాటికి ప్రాజెక్టు, పునరావాసం పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మార్చాలని విన్నవించారు. ప్రాజెక్టుపై రాష్ట్రం పెడుతున్న నిధులను త్వరితగతిన రీయంబర్స్ చేయాలని కోరారు.
నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశం దాదాపు గంటపాటు జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించాల్సిన ఇళ్లు, కేంద్ర సహకారంపై సీఎం వైఎస్ జగన్ నీతి అయోగ్ వైస్ చైర్మన్‌తో చర్చించారు.
ఈ రోజు రాత్రి సీఎం వైఎస్ జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌తో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనను ముగించుకుని రేపు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి రానున్నారు.
Also Read : జగన్ ఢిల్లీ పర్యటన, విపక్షాలకు మింగుడుపడని విషయమేంటి?