iDreamPost
android-app
ios-app

జగనన్న తోడు రుణం ఇలా చెల్లించాలి.. అర్హులకు మరో అవకాశమిచ్చిన సీఎం జగన్‌

జగనన్న తోడు రుణం ఇలా చెల్లించాలి.. అర్హులకు మరో అవకాశమిచ్చిన సీఎం జగన్‌

చిరు వ్యాపారులు, పాడి రైతులకు సున్నా వడ్డీకే పది వేల రూపాయల రుణం అందించే జగనన్న తోడు పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. దాదాపు పది లక్షల మంది లబ్ధిదారులకు పది వేల రూపాయల చొప్పున వేయి కోట్ల రూపాయల రుణం ఎలాంటి పూచికత్తు లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తోంది. వారం పది రోజుల్లో దరఖాస్తుదారులు బ్యాంకు ఖాతాల్లో పది వేల రూపాయలను జమ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు.

పది వేల రూపాయల రుణం ఎలా చెల్లించాలన్న విషయంపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ క్లారిటీ ఇచ్చారు. ఏడాది లోపు ఈ రుణం నెల వారీ సులభవాయిదాల్లో చెల్లించాలని సీఎం జగన్‌ తెలిపారు. అలా ప్రతి నెలా వాయిదా చెల్లించిన వారి భ్యాంకు ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని పత్రి మూడు నెలలకు ఒక సారి ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. అసలు లబ్ధిదారులు కడితే.. ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రుణం చెల్లించిన తర్వాత మరుసటి ఏడాది కూడా ఇలానే పది వేల రూపాయల వడ్డీలేని రుణాలను లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ డ్వాక్రా సంఘాల మాదిరిగా నిరంతరం సాగుతుందని తెలిపారు.

అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే చిరు వ్యాపారులకు తోడుగా ఉండాలనే ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానన్న సీఎం జగన్‌.. వారి కోసమే ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అర్హులు ఎవరైనా మిస్‌ అయితే.. గ్రామ సచివాలయాల్లో ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. నెల రోజుల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ తర్వాత వారికి పది వేల రూపాయల రుణం అందిస్తామని చెప్పారు.