iDreamPost
android-app
ios-app

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు.. ఫిష్సింగ్‌ హార్బర్లకు సీఎం శంకుస్థాపన

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు.. ఫిష్సింగ్‌ హార్బర్లకు సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్లకు ఈ రోజు శనివారం శంకుస్థాపన చేశారు. 972 కిలోమీటర్ల సముద్రతీరం, అపారమైన మత్స్య సంపద ఉన్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేక రాష్ట్ర మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్రలకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సరిహద్దులు దాటడంతో పాకిస్థాన్‌ నేవికి చిక్కి ఏళ్ల తరబడి ఆ దేశ జైళ్లలో మగ్గారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రణాళికలు రచించారు.

రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో 8 చోట్ల ఫిష్సింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని రెందు దశల్లో నిర్మించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దఫాలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో నాలుగు హార్బర్లకు ఈ రోజు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. మొత్తం 1,510 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం పూర్తి చేయనున్నారు.

ఫిష్సింగ్‌ హార్బర్ల వల్ల ఆయా జిల్లాల్లోని మత్స్యకారులు స్థానికంగానే వేటకు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం కూలికి వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది.

హర్భర్లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌ 15 కల్లా నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్లకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో మిగిలిన నాలుగు ఫిష్సింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 30 శాతం మత్స్య ఉత్పత్తులను రాష్ట్రంలోనే వినియోగించేలా మార్కెటింగ్‌ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సచివాలయం వద్ద జనతా బజార్లు ఏర్పాటు చేసి.. వినియోగదారులకు చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులు సరసమైన ధరలకే అందించి.. పౌష్టికాహార భద్రతను కల్పిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తామని  సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వీటన్నింటికి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించనున్నామని వెల్లడించారు. ఏడాదిలోనే వీటికి ఓ రూపు తెచ్చి.. మత్స్యకారులు జీవితాలను మారుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.