iDreamPost
android-app
ios-app

ప్రాణదాతకు ప్రాణం పోసిన సీఎం జగన్‌

ప్రాణదాతకు ప్రాణం పోసిన సీఎం జగన్‌

అతనో వైద్యుడు..ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా వైరస్‌బారిన పడిన వేలాది మందికి ప్రాణం పోశారు. ఇంత మందికి ప్రాణం పోసిన ఆ వైద్యుడు.. చివరకు ఆ మహమ్మారి బారిన పడ్డారు. పరిస్థితి విషమించింది. ఆయన బతకాలంటే 1.50 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వ వైద్యుడైన ఆయనకు అంత మొత్తం భరించే స్థొమత లేదు. ఏం చేయాలి..? ఎవరిని అడగాలి..? అనుకుంటున్న సమయంలో.. ఆయన వద్ద వైద్యం పొంది కోలుకున్న కుంటుంబాల వారు.. సదరు డాక్టర్‌ పరిస్థితిని వివరిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి చాటారు.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రజల ప్రాణాలను నిలబెట్టిన ఆ వైద్యుడికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించారు. వెంటనే కోటి రూపాయలు విడుదల చేశారు. మిగతా మొత్తం కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తగట్టుకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు.. ప్రకాశం జిల్లా కారంచేడు ప్రాథమిక వైద్యశాలలో వైద్యాధికారికిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో దాదాపు ఆరువేల మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిని వారికి అండగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్‌ 24వ తేదీన వైరస్‌ బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. పది రోజుల తర్వాత శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో విజయవాడ ఆయూష్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద, ఆ తర్వాత గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైన విషయం గుర్తించిన వైద్యులు.. వెంటనే మార్చాలని, అందుకు కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు.

ఈ విషయాన్ని భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరావు దృష్టికి విషయం తీసుకెళ్లగా.. ఆయన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విషయం చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రిగా పేరొందిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే స్పందించారు. వైద్యుడు చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. తక్షణమే కోటి రూపాయలు సంబంధిత ఆస్పత్రికి పంపేలా చర్యలు తీసుకున్నారు. మిగతా 50 లక్షలు కూడా పంపాలని ఆదేశించారు.

భాస్కరరావు పూర్తి ఆరోగ్యంతో త్వరలో మళ్లీ ప్రజలకు వైద్య సేవలు అందించబోతున్నారు. కష్టం తన దృష్టికి వస్తే.. అండగా నిలబడే సీఎం వైఎస్‌ జగన్‌.. మరోమారు భాస్కరరావు విషయంలో తన పెద్ద మనసును చాటుకున్నారు. కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించే భాస్కరరావు ప్రాణాలు నిలబెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.