పాత, కొత్త కలయికతో కేబినెట్‌.. కొనసాగుతున్న కసరత్తు..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మొత్తం కేబినెట్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నూతన మంత్రివర్గ ఏర్పాటుపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు ఎలాఉండాలన్న అంశంపై సీఎం జగన్‌ సమాలోచనలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్‌తో సుదీర్ఘ సమయం భేటీ కాగా.. ఈ రోజు మరోసారి సమావేశమయ్యారు.

పాత, కొత్త కలయికతో నూతన మంత్రివర్గం కూర్పు ఉండబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ధృవీకరించారు. ప్రస్తుతం మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారని చెప్పిన సజ్జల.. రేపు మధ్యాహ్నంకు కసరత్తు పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ప్రమాణస్వీకారం చేయబోయే వారికి కూడా స్వయంగా ఫోన్లు చేసి సమాచారం అందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

కాగా, మంత్రివర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన చోటనే.. నూతన మంత్రులు ప్రమాణం చేయబోతున్నారు. సోమవారం ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సమయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తోపాటు పాత, కొత్త మంత్రులకు తేనీటి విందు ఇవ్వబోతున్నారు.

Show comments