iDreamPost
android-app
ios-app

జగన్ పై దాడి… చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల సంచలన వీడియో

  • Published Apr 14, 2024 | 2:17 PM Updated Updated Apr 14, 2024 | 2:20 PM

Sajjala Ramakrishna Reddy-Attack CM YS Jagan: ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల సంచలన వీడియోని తెర మీదకు తీసుకొచ్చారు. ఆ వివరాలు..

Sajjala Ramakrishna Reddy-Attack CM YS Jagan: ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల సంచలన వీడియోని తెర మీదకు తీసుకొచ్చారు. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 2:17 PMUpdated Apr 14, 2024 | 2:20 PM
జగన్ పై దాడి… చంద్రబాబు కుట్రే అంటూ సజ్జల సంచలన వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ, వేరే రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలు ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు.

ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ, రాయి ఏమాత్రం కొంచెం పక్కకు తగిలినా.. జగన్ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొంచెం కిందకు తగిలి ఉంటే ఆయన కన్ను పోయి ఉండేది అన్నారు. అంతేకాక ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు సజ్జల.

పక్కా ప్లాన్ ప్రకారమే దాడి..

సజ్జల మాట్లాడుతూ.. ‘‘జగన్ పై దాడి చేసింది ఎవరో ఆకతాయిలు కాదు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు. ఎయిర్‌గన్‌ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతితో రాయిని విసిరి ఉంటే.. ఇంత బలంగా తగిలేది కాదు. ప్రధాని మోదీతో సహా రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ పై దాడిని ఖండించారు. ఎవరైనా సరే దీనిపై విచారణ జరపాలని సూచిస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడుతున్నారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరూ ఈ విధంగా మాట్లాడరు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

ఓటమి భయంతోనే బాబు కుట్రలు..

‘‘ఇది మాములు సంఘటన కాదు. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ ప్లాన్. దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా కుట్రలు చేస్తున్నాడు. దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్‌ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ బస్సు యాత్ర నుంచి విరామం తీసుకున్నారు. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదు. సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. జరిగిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి’’ అన్నారు సజ్జల.

చంద్రబాబు దాడులకు రెచ్చగొడుతున్నారు..

‘‘సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది. అందుకే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. జగన్ పై దాడి చేయండి.. కొట్టండి అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. అధికారం రాదన్న అసహనంతో ఇలా చేస్తున్నాడు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడం తట్టుకోలేకనే ఈ దాడి చేశారు. చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం వంటివి ఉన్నాయి‘‘ అని విమర్శించారు.

’’చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎంతలా నటించాడో జనాలు ఇంకా మర్చిపోలేదు. జనాల్లో సానుభూతి పొందడం కోసం బాబు ఎన్నికల ప్రచారానికి చేతికి కట్టుతో వెళ్లాడు. కానీ చంద్రబాబు డ్రామాలను ప్రజలు పట్టించుకోలేదు.. ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పారు. చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాసుకొచ్చాడు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు. ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు’’ అన్నారు సజ్జల.