Idream media
Idream media
పీఆర్‌సీ, ఇతర డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరును సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తూర్పారబట్టారు. ఈ రోజు టైలర్లు, దుకాణాలు నడుపుకుంటున్న రజకులు, నాయీ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు పథకం కింద ఇచ్చే పదివేల రూపాయలను రెండోసారి వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శ్రీకారం చుట్టారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయడం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల ఆందోళన విరమణపై టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వివిధ రాజకీయ పక్షాలు, మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును, రెండున్నరేళ్లలో కొత్తగా కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు ఎంతెంత జీతాలు పెరిగిందన్న విషయాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఇవన్నీ ఉద్యోగులకు, ప్రజలకు తెలిసినవే అయినా.. మరోసారి గుర్తుచేస్తున్నానంటూ సీఎం జగన్ మాట్లాడారు.
‘‘ ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా..? అని అన్న దిగజారుడు వ్యక్తి.. ఈనాడు, రామోజీ రావుకు ముద్దుబిడ్డగా ఉన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి ఏబీఎన్, టీవీ 5లకు ముద్దబిడ్డగా ఉన్నారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి.. ఎర్ర జెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్‌గా తయారయ్యారు. ప్రపంచ కమ్యూనిస్టు చర్రితలో కనీవినీ ఎరుగని విధంగా.. బాబు బినామీ భూముల రియల్ ఎస్టేట్ ధరలకోసం కామ్రేడ్ సోదరులు జెండాలు పట్టుకుంటున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే.. వీరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని పిటిషన్లు వేసిన చంద్రబాబుకు మద్ధతుగా కామ్రేడ్లు ఉన్నారంటే ఏ స్థాయికి వారు దిగజారిపోయారో కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కోరుకుంటారు..? ప్రజలు, ప్రభుత్వం కోరుకోదు. ఉద్యోగులు కూడా కోరుకోరు. దాదాపు రెండున్నరేళ్ల కాలంలో నేరుగా బటన్ నొక్కి 1.27 లక్షల కోట్ల రూపాయలు అందుకున్న కుటుంబాల్లోని ఏ ఒక్క కుటుంబం కూడా కోరుకోదు. ఏ ఒక్క సామాజికవర్గం కూడా కోరుకోదు. కోరుకునేది ఎవరు..? సమ్మె, ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా..? చంద్రబాబు సీఎం కాలేదని బాధ, కడుపు మంట ఉన్నవారికి మాత్రమే కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి, బాబు దత్త పుత్రుడుకి కావాలి. వ్యక్తుల పరంగా మీడియాను నడిపిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు కావాలి. కాబట్టే ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. సమ్మె లేదంటే వీళ్లు ఏడుపు మొహం పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడంలేదంటే.. కమ్యూనిస్టు సోదరులను ముందుకు తోశారు. పచ్చ జెండాలను మోసే పచ్చబాబు పచ్చ జెండా ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు నెట్టారు. ముందు ఎర్ర జెండా వెనుక పచ్చ అజెండా. ఇదీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.
ఈ రోజు ఈనాడు మొదటి పేజీలో చూస్తే.. ఆశాలు రోడ్డు మీదకు వచ్చారని రాశారు. వారిని మహిళా పోలీసులు ఈడ్చారన్నట్టుగా ఫోటో వేశారు. ఆశాల మీద ఈనాడుకు ప్రేమ ఉన్నట్లు చూపించే అభూత కల్పన. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ , మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని ఈనాడు గుండెలు బాదుకోవడం వెనుక మాత్రం పచ్చ, పచ్చముసుగులో ఉన్న ఎర్ర అజెండా. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో ఛానెళ్ల బాధ అంతా ఇంత కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి.. మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి.. మా బాబు పాలనే బాగుందని చెప్పండి.. మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి. ముఖ్యమంత్రిని తిడితే బాగా కవరేజ్ ఇస్తాం. సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే.. దాన్ని ప్రధానంగా ప్రచురిస్తాం, ఛానెళ్లలో చూపిస్తాం. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా ధోరణి.
ఇవి చూస్తుంటే బాధ కలిగినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తేంటే ఆ బాధ నుంచి నవ్వు కూడా వస్తోంది. నిజంగా ఈ స్థాయికి ఈ రోజు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడని సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి మన ప్రభుత్వం వచ్చే వరకు రాష్ట్రంలో 3.97 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చిన ఉద్యోగాలు.. మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.20 లక్షల మంది ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్ధాలుగా కలలుగన్న 51 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. రెండున్నరేళ్లలో మొత్తం 1.84,264 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఏకంగా 50 శాతం పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారంటూ రాస్తున్న, మాట్లాడుతున్న వీళ్లకు ఈ గణాంకాలు కనిపించడం లేదా..?
ఈ రోజు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకూడదు, జీతాలు తీసుకునేటప్పుడు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుడదూ, దళారీల వ్యవస్థ లేకుండా నేరుగా జీతాలు ఇవ్వాలని ఒక కార్పొరేషన్ పెట్టాం. దాదాపు లక్ష మందికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ప్రయోజనాలు మన ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్క ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం వల్ల ఏడాదికి 3,600 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. పక్కన తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో ఏపీలో మాదిరిగా మమ్మల్ని విలీనం చేయాలని అడిగితే.. పట్టించుకున్నారా..? ఒక్కసారి ఆలోచించండి. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపించారు కానీ.. ఒక్కరికీ చేయలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్‌ను అమలు చేశాం.
2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఏఏ ఉద్యోగులకు ఎంతెంత జీతం ఇచ్చారు..? మన ప్రభుత్వం వచ్చాక ఎంత జీతం ఇచ్చామో వారికి, ప్రజలకు తెలుసు. అయినా ఒక్కసారి గుర్తుచేద్దాం. 2019కి ముందు అంగన్‌వాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయలు ఇస్తే.. మన ప్రభుత్వం వచ్చాక 11,500 రూపాయలు ఇస్తున్నాం. మినీ అంగన్‌వాడీ వర్కర్లకు 4,500 రూపాయలు అయితే మనం వచ్చాక 7 వేల రూపాయలకు పెంచాం. సంఘమిత్రలు, యానిమేటర్లకు మూడు వేల రూపాయలు ఇస్తే.. మనం వచ్చాక పది వేల రూపాయలు చేశాం. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గతంలో 12 వేల రూపాయలు అయితే అది 18 వేల రూపాయలు చేశాం. ఆశా వర్కర్లకు బాబు హయాంలో జీతాలు కేవలం మూడు వేల రూపాయలు ఇచ్చారు. మనం పది వేల రూపాయలు ఇస్తున్న విషయం నిజం కాదా..? గిరిజన సంక్షేమ వర్కర్లకు కేవలం నాలుగు వందలు ఇచ్చారు..మనం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం. హోం గార్డులకు 18 వేలు అయితే.. మనం 21,300 రూపాయలు ఇస్తున్నాం. 108 వ్యవస్థలోని డ్రైవర్లకు నెలకు 13 వేల రూపాయలు అయితే.. ఇప్పుడు 28 వేల రూపాయలు ఇస్తున్నాం. 3.17 లక్షల మందికి గతంలో బడ్జెట్ 1198 కోట్ల రూపాయలు అయితే.. ఇప్పుడు మనం ప్రభుత్వం ఇస్తున్న జీతాల ఖర్చు 3187 కోట్ల రూపాయలు. అలాంటిది వీళ్లను రెచ్చగొట్టేందుకు, ఆందోళన బాట పట్టించేందుకు పచ్ఛజెండాలు, ఎర్రజెండాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ రోజు ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యాక.. ఆ ప్రక్రియలో భాగస్వామ్యులు అయిన లెఫ్ట్ పార్టీల యూనియన్లు.. సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కానీ మరుసటి రోజున కొన్ని ఎర్రపార్టీలు, పచ్చపార్టీలకు చెందిన యూనియన్లు, కొంత మంది టీచర్లు ఆందోళన బాట పడతామని మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదు. పాస్ చేస్తూ వెళుతున్నాం. ఇది మూడో ఏడాది. పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై టీచర్లను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుంటే.. ఆ పిల్లల చదువులు ఏం కావాలి. పిల్లల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు..? మూడో ఏడాది కూడా పిల్లల చదువులను బ్రష్టు పట్టించాలనుకుంటున్నారు. ఇలాంటి కుట్రలు చేసే వారు మనుషులేనా..? వారికి ఇది ధర్మమేనా..?’’ అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇన్ని కుట్రలు జరుగుతున్నా.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుతున్నానని సీఎం జగన్ ఆకాంక్షించారు.