Idream media
Idream media
ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు 25 మందితో మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాను గవర్నర్‌కు అధికారికంగా పంపాల్సి ఉంది.
పాత, కొత్త మంత్రుల కలయికతో నూతన మంత్రివర్గం ఏర్పాటు కాబోతోంది. కొత్త మంత్రివర్గంలో పదిమంది పాత వారు ఉండగా.. మరో 15 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సమర్థత, పార్టీ పట్ల విధేయత, ఆది నుంచి పార్టీలో ఉంటూ పార్టీ పటిష్టత కోసం కష్టపడిన వారికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. ప్రారంభంలోనే మంత్రులుగా కావాల్సిన వారని అందరూ భావించిన వారికి ఈ సారి సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఉత్తరాంధ్ర నుంచి వీరికి..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజును కొనసాగించిన సీఎం జగన్.. కొత్తగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యానారాయణను కొనసాగించిన సీఎం.. కొత్తగా పి.రాజన్నదొరకు అవకాశం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఇద్దరు నేతలకు కొత్తగా అవకాశం కల్పించారు. గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడులకు చోటు కల్పించారు.
కోస్తాలో వీరికి అవకాశం..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పినిపే విశ్వరూప్‌ను, చెల్లుబోయిన వేణుగోపాల్‌ను కొనసాగించిన సీఎం జగన్.. కురసాల కన్నబాబు స్థానంలో దాడిశెట్టి రాజాను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనితను కొనసాగించిన సీఎం జగన్.. కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ ఒక్కరికే మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నుంచి కాకాని గోవర్థన్ రెడ్డికి అవకాశం కల్పించారు.
రాయలసీమ నుంచి..
రాయలసీమ జిల్లాల నుంచి కొంతమంది పాత మంత్రులతో పాటు కొత్తవారికి సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి అంజాద్ బాషను కొనసాగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలను కొనసాగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలను కొనసాగించిన సీఎం జగన్.. కొత్తగా ఆర్‌కే రోజాకు అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా నుంచి ఉషా శ్రీ చరణ్, ఎమ్మెల్సీ తిప్పేస్వామిలను కొత్తగా మంత్రివర్గంలోకి సీఎం వైఎస్ జగన్ తీసుకున్నారు.
కీలక నేతలకు నామినేటెడ్ పదవులు..
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర అభివృద్ధి బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించారు. కేబినెట్ హోదాలో కొడాలి నాని ఆ పదవిలో కొనసాగబోతున్నారు. ముదునూరు ప్రసాదరాజును ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. మల్లాది విష్ణుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్‌గా సీఎం వైఎస్ జగన్ నియమించారు.