Idream media
Idream media
ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరుతో ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీ, గృహనిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. దీనికి కొనసాగింపుగా ఈ రోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి శ్రీకాళహస్తి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. కొద్దిసేపటి క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందుకూరులో ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలను జగన్ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పట్టణాల్లో వీలునుబట్టీ సెంటు నుంచి సెంటున్నర, గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా సెంటున్నర చొప్పన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా నవరత్నాల్లో ఇళ్ల నిర్మాణ హామీ కూడా ఒకటి. 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పలుమార్లు అర్హులను గుర్తించడంతో.. లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఇళ్ల స్థలం పట్టా ఇవ్వడంతోపాటు.. 1.80 లక్షల విలువైన ఇండిపెండెంట్ ఇంటిని ప్రభుత్వమే ఉచితంగా నిర్మించి లబ్ధిదారునికి ఇవ్వబోతోంది. 30.75 లక్షల మందికి వచ్చే నెల 7వ తేదీ లోపు పట్టాలు ఇవ్వనున్నారు. అదే సమయంలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఏడాదిలో వీటి నిర్మాణాలను పూర్తి చేయనున్నారు.