Idream media
Idream media
ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి.. మరో వైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు, సంస్థలకు వ్యాక్సిన్ ఇస్తే.. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతాయి.. డిమాండ్‌ను, ప్రజల్లో ఆందోళనలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటారనే ఆందోళనలు సర్వత్రా వెలువడ్డాయి. అదే జరిగితే ప్రభుత్వాలకు చెడ్డపేరు వస్తుంది. ఇవే అంశాలను పేర్కొంటూ.. ప్రైవేటుకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయినా.. కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. మే 1వ తేదీ నుంచి దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లో 25 శాతం ప్రైవేటు సంస్థలకు, ఆస్పత్రులకు కేటాయించింది.
దోపిడీదారులకు మూకుతాడు..
ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ ఛాయలు కనిపించాయి. అనంతపురం, గుంటూరు తదితర ప్రాంతాల్లో ప్రైవేటు డాక్టర్లు, ఫార్మసిస్టుల ఈ దందాకు తెరలేపగా.. ప్రభుత్వం వారి చర్యలకు అడ్డుకట్ట వేసింది. అదే సమయంలో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా వ్యాక్సిన్ వచ్చేలా చర్యలు చేపడుతూ.. ప్రాధాన్యతల వారీగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించింది. మొదట 45 ఏళ్లు పైబడి వారికి గ్రామ, వార్డు సచివాలయాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో.. ఎవరూ వ్యాక్సిన్ కోసం ప్రైవేటును ఆశ్రయించలేదు. 45 ఏళ్ల వయస్సు పై బడిన వారితోపాటు ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్న తల్లులకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ప్రమాదం పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలతో చిన్నారుల సంరక్షణ కోసం వారి తల్లులకు వ్యాక్సిన్‌ను అందించింది.
Also Read : ప్యాకేజి అంటే సహాయమా లేక రుణమా?
ప్రైవేటును ఆశ్రయించని ప్రజలు..
ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గ్రామాలలో కూడా కొనసాగుతుండడంతో.. ప్రజలు వ్యాక్సిన్ కోసం అందోళన పడలేదు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ దూకుడుగా వ్యవహరించారు. దీంతో ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులు, సంస్థలలో వ్యాక్సిన్ విక్రయాలు అత్యంత స్వల్పంగా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి. మే 1 నుంచి ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులకు వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటి వరకు కేవలం 2,67,075 మంది మాత్రమే అక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో భారీగా వ్యాక్సిన్ నిల్వలు ప్రైవేటు ఆస్పత్రులలో పేరుకుపోయాయి. ఈ గణాంకాలు ఏపీలో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాయి.
జగన్ లేఖ నిదర్శనం..
ఏపీలో వ్యాక్సిన్ దందా జరగలేదనేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖనే నిదర్శనం. ప్రైవేటు ఆస్పత్రులలో మిగిలిపోయిన వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించాలని సీఎం జగన్.. మోదీని కోరారు. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు మిగిలిపోగా.. మళ్లీ జూలై నెలకు ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించిందని సీఎం జగన్ గర్తు చేశారు. అయితే అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లుగానే కేంద్రం ఏపీలోని ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు కేటాయించింది. కానీ.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యాక్సిన్‌పై ప్రభుత్వం భరోసా ఇస్తుండడంతో.. ప్రజలు ప్రైవేటు వైపు వెళ్లడం లేదు. జగన్ కోరినట్లు ప్రైవేటు ఆస్పత్రులలో మిగిలిపోయిన వ్యాక్సిన్లు కూడా ప్రభుత్వానికి అందిస్తే.. మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందే అవకాశం ఉంటుంది. మరి సీఎం జగన్ లేఖపై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read : అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ట్విస్ట్ – చంద్రబాబు అండ్ కోకు చిక్కులు తప్పవా..?