Idream media
Idream media
అభివృద్ధి.. ఇదో బ్రహ్మపదార్థం. అభివృద్ధి, సంక్షేమం.. మాకు రెండు కళ్లు అంటూ ప్రభుత్వాలు చెప్పడం విన్నాం. సంక్షేమంతోపాటు అభివృద్ధికి మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అమాత్యులు చెబుతుంటారు. సంక్షేమం అంటే.. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో అర్హులైన వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చడం. మరి అభివృద్ధి అంటే.. ఈ మాటకు ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వం హాయంలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం. అమరావతిలో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నాంటూ.. గ్రాఫిక్స్, భవనాల డిజైన్లు చూపించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా.. అలాంటి భవనాలు కడతామని చెప్పడం లేదు. గ్రామ స్థాయిలో చిన్న చిన్న భవనాలను కడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయడంతో.. ఏపీలో సంక్షేమ రాజ్యం ఆవిసృతమైంది. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలే అమలు చేస్తోంది కానీ.. అభివృద్ధి చేయడంలేదంటూ ప్రతిపక్ష టీడీపీ సహా, జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తరహాలో విమర్శలు చేస్తూ.. అభివృద్ధి చేయడంలేదంటూ మాట్లాడుతున్న వారికి సీఎం వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ఆ క్లాస్‌లో వివరించారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబం తన అవసరాలను తీర్చుకోవడమే అభివృద్ధి అని గతంలో పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. టీడీపీ నేతలు ఆశిస్తున్న భవనాల అభివృద్ధి తన హాయంలో ఎలా సాగిందో ఈ రోజు రాయదుర్గం సభలో వివరించారు. విమర్శలు చేస్తున్న వారు.. ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏమిటో కనిపిస్తుందన్నారు వైఎస్ జగన్.
‘‘ శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను నాడు నేడు పేరుతో.. సకల సౌకర్యాలతో కనిపిస్తాయి. గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసే పంది మంది మన పిల్లలు కనిపిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే మన వాలంటీర్లు కనిపిస్తారు. ఆ పక్కనే విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతును చేయి పట్టి నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. 91 అనారోగ్యాలకు మందులు లభించే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అందులో పని చేసే ఆరోగ్య సిబ్బంది కనిపిస్తారు. పాల కేంద్రం కనిపిస్తుంది. ఇంకా రాబోయో రోజుల్లో గోదాములు, మల్టిపర్పస్ కేంద్రాలు కనిపిస్తాయి.. ’’ అంటూ సీఎం వైఎస్ జగన్ వివరించారు. మరి జగన్ చెప్పినట్లు.. తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు.. గ్రామాలకు వెళ్లి అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకుని.. అర్థం చేసుకుంటారా..?
Also Read : వివాదాలొద్దు.. రైతే ముద్దు.. జల వివాదంపై కుండబద్ధలు కొట్టిన జగన్