Idream media
Idream media
కరోనా వైరస్ మహమ్మారి తో దేశమంతా అతలాకుతలం అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రముఖుల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది. ప్రభుత్వ సహాయ నిధికి విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఇదిలా ఉండగా.. కొవిడ్ పై పోరాటానికి 13 మంది ఎమ్మెల్యేలతో స్టాలిన్ ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 12 ప్రతిపక్ష పార్టీ నేతలే ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏఐడీఎంకే నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
అధికారం చేపట్టిన నాటి నుంచీ ఏపీ సీఎం జగన్ వలే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవలే ప్రతిపక్ష నేత ఇంటికెళ్లి స్వయంగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానించిన ఆయన ఇప్పుడు కొవిడ్ పై పోరుకు ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్ లో ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ అవకాశం ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి స్టాలినే చైర్‌పర్సన్‌గా వ్యవహరించబోతున్న ఈ కమిటీలో డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ), నాగై మాలి (సీపీఎం) సభ్యులుగా కొనసాగనున్నారు.
ఈ పాలక మండలి రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనుందని, కొత్త రాజకీయ ఒరవడికి కారణం కాబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ కమిటీలో భాగమై ఉండడం, ముఖ్యంగా అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే మధ్య సత్సంబంధాలకు ఇది పెద్ద పీట వేయనుందని అంటున్నారు. ఈ కమిటీ విషయమై మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత కమిటీ సభ్యుడు సీ విజయ్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అన్ని రాజకీయ పార్టీలతో కలిపి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా మండలికి, ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను. కోవిడ్ మొదటి వేవ్ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ఈ కమిటీ పని చేయగలదని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.