iDreamPost
android-app
ios-app

తేనేటి విందులో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ , 8 నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు

  • Published Jun 28, 2022 | 1:20 PM Updated Updated Jun 28, 2022 | 1:20 PM
తేనేటి విందులో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ , 8 నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు

తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ఉజ్జ‌ల్ భూయాన్ చేత ప్ర‌మాణం చేయించారు.

ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన తేనేటి విందులో కేసీఆర్ త‌మిళిసైతో ముచ్చ‌టించారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్, సీఎం, కేంద్ర మంత్రి న‌వ్వుతూ మాట్లాడుకున్నారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ 8 నెల‌ల త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. కొంత కాలంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌ధ్య వ్య‌వ‌హారం వేడిగానే ఉంది. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపాల‌న్న‌ కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డంతో ఇద్ద‌రి విభేదాల‌కు బీజం ప‌డింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటారు.

అసెంబ్లీ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌లేదు ప్ర‌భుత్వం. ఆ అసంతృప్తిని గ‌వ‌ర్న‌ర్ దాచుకోలేదు. కేసీఆర్ స‌ర్కార్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డంతో అగ్గిపుట్టింది. ఆ త‌ర్వాత‌ ఉగాది వేడుక‌ల‌కు సీఎం, మంత్రుల‌ను ఆహ్వానించినా వాళ్లెవ‌రు వెళ్ల‌లేదు. రాజ్‌భ‌వ‌న్‌లో మ‌హిళా ద‌ర్బార్‌ను గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హించడం కేసీఆర్ ప్ర‌భుత్వానికి అస్స‌లు న‌చ్చ‌లేద‌ని అంటున్నారు.

ఈయేడాదిలో రాజ్‌భ‌వ‌న్‌లో కేసీఆర్ అడుగు పెట్టారు. తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ప్ర‌మాణ స్వీకారానికి సీఎంతోపాటు మంత్రులు హాజ‌రైయ్యారు. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఇద్దరూ పక్కపక్కనే కూచోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది.


గత అక్టోబ‌ర్‌లో తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్‌చంద్ర శర్మ ప్ర‌మాణ స్వీకారం చేసే సంద‌ర్భంలో కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి చీఫ్ జ‌స్టిస్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజరైయ్యారు.