Idream media
Idream media
కరోనా రెండో దశ కట్టడిని, వ్యాక్సినేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తన రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత కోసం చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇందు కోసం ఓ వైపు కేంద్రంతో సంప్రదింపులు చేపడుతూనే, మరోవైపు తానే నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలతో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా, సుమారు 15 రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ మూడు సార్లు లేఖలు రాశారు. తమ రాష్ట్రానికి వ్యాక్సిన్ త్వరగా పంపాలని, పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి పదే పదే గుర్తు చేస్తున్నారు.
సచివాలయ వ్యవస్థ సైతం వ్యాక్సిన్ కోసం పని చేస్తోందని, రికార్డు స్థాయిలో కార్యక్రమం కొనసాగుతుందన్న విషయాన్ని కేంద్రానికి తెలుపుతున్నారు. మీరు పంపడమే ఆలస్యం.. తాము సిద్ధం అంటూ పలుమార్లు గుర్తు చేయడం ద్వారా త్వరితగతిన ఏపీకి వ్యాక్సిన్ డోసులు తెప్పించుకునేలా కృషి చేస్తున్నారు. జగన్ లేఖాస్త్రాల మూలంగా ఏపీకి వ్యాక్సిన్ డోసులు వెల్లువలా వస్తున్నాయి.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇందుకు కారణంగా వ్యాక్సిన్ డోసులు ఎప్పుడూ నిల్వలు ఉండేలా చూసుకోవడమే. వ్యాక్సిన్ లేక పలు రాష్ట్రాలలో అప్పుడప్పుడూ ఆ ప్రక్రియను నిలిపేస్తున్నారు.
కానీ, ఏపీలో మాత్రం నిరంతరం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి వచ్చాయి. అనంతరం వాటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి 5 లక్షల డోసులను 13 జిల్లాలకూ రోడ్డు మార్గం ద్వారా తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం చెప్పారు.
రాష్ట్రానికి రావడం తరువాయే వెంటనే వాటిని ఆయా జిల్లాలకు తరలించి పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా అనంతపురం జిల్లాకు 45 వేలు, చిత్తూరు జిల్లాకు 40 వేలు, తూర్పు గోదావరి 40 వేలు, గుంటూరు 40 వేలు, కృష్ణా 45 వేలు, కర్నూలు 40 వేలు, ప్రకాశం 35 వేలు, నెల్లూరు 38 వేలు, శ్రీకాకుళం 30 వేలు, విశాఖ 40 వేలు, విజయనగరం 30 వేలు, పశ్చిమ గోదావరి–37 వేలు, వైఎస్సార్ కడప 40 వేల టీకా డోసులను తరలించి వ్యాక్సిన్ వేస్తున్నారు.
మరో 9 లక్షల డోసులు
మూడు రోజుల క్రితమే 5 లక్షల డోసులను తెప్పించిన రాష్ట్రం.. కొద్ది రోజుల్లోనే మరో 9 లక్షల డోసులను తీసుకొస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మే నెల కోటా కింద 9 లక్షల కోవిడ్ టీకాలు రానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు. 13 లక్షల డోసులు కేంద్రం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో 18,037 రెమిడెసివిర్ అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 11,556 రెమిడెసివిర్‌లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రోజూ లక్షలకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరాలో కూడా ఏపీ రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 387 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఏకే సింఘాల్ తెలిపారు. 3,220 మంది వైద్యులు 104 కాల్ సెంటర్ ద్వారా టెలీ కన్సల్టెంట్స్ ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం ఏపీకి 4,800 రెమిడెసివిర్ వయల్స్ కేటాయించిందని వెల్లడించారు. సీఎం జగన్ నిత్య కృషితోనే ఇది సాధ్యమవుతోందని ఆయన చెబుతున్నారు.