Idream media
Idream media
ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో పథకాన్ని ప్రారంభించనుంది. అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయి. చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి పేరిట ఏటా రూ.15వేలు అందజేయడం ద్వారా పేదకుటుంబలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. ఇప్పుడు కొత్తగా వసతి దీవెన పేరిట ఫిబ్రవరి 24న మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 24న విజయనగరం వస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్ధుల ఉన్నత చదువులకు అండగా నిలిచేందుకోసం ఉద్దేశించిన జగనన్న వసతిదీవెన పథకాన్ని ముఖ్యమంత్రి విజయనగరం నుండే ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో 11,87,904 మంది విద్యార్ధులు ఈ వసతి దీవెన పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న153 కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన 58,091 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందుతారు. డిగ్రీ ఆపై చదువులు చదివే వారికి ఏడాదికి రూ.20 వేలు రెండు విడతల్లో చెల్లిస్తారు. ఫిబ్రవరిలో రూ.10 వేలు, జూలై నెలలో రూ.10 వేలు వంతున విద్యార్ధుల తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఐటిఐ చదువుతున్న వారికి మొత్తం రూ.10 వేలు, తొలివిడతగా రూ.5000 అందజేస్తారు. పాలిటెక్నిక్ చదివే వారికి రూ.15 వేలు, తొలివిడతగా రూ.7500 చెల్లించనున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఏదో ఒక సంక్షేమ పథకం కిందకు వచ్చినట్లు అయింది. ఉన్నత విద్య, ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి చదువులు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ఫీజు రీ యింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తుండగా స్కూల్, ఇంటర్ విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నారు.