iDreamPost
android-app
ios-app

రథసప్తమికి నరసింహుడి “రథ” వైభోగం!!

రథసప్తమికి నరసింహుడి “రథ” వైభోగం!!

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, రథసప్తమి వేడుకకు ఎంతో విశిష్టత ఉంది. స్వామి వారికి కల్యాణ క్రతువులలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు రావడం చూడొచ్చు. రథసప్తమి రోజు దగ్గరనుంచి మూడు రోజులపాటు స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అయితే చీకటి గుర్తుల అంతర్వేది స్వామి వారి రథం గుర్తులు మాత్రం ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్నాయి . గత ఏడాది రథం దగ్ధం కావడం, దాని తర్వాత యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించి కొత్త రథం తయారీ పూర్తయింది. శుక్రవారం అంతర్వేది వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రధాన్ని ప్రారంభించి పూజలు చేయనున్నారు.

చీకటి రాత్రి… వెంటనే స్పందించిన ప్రభుత్వం

అంతర్వేది క్షేత్రంలో స్వామివారి రథానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కీలకమైన వేడుకలు ఉత్సవాలు సమయాల్లో లక్ష్మీ నరసింహ స్వామి వారిని రథం మీద అధిరోహించి నిర్వహించడం ఆనవాయితీ. అయితే గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి అంతర్వేది రథం దగ్ధం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. మండపం లో ఉన్న రథం అగ్ని ప్రమాదానికి గురికావడంతో వెను వెంటనే ప్రభుత్వం చర్యలు చెపట్టింది. స్వామివారి రథాన్ని తయారు చేయించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది . దీనిపై కొన్ని హిందూ ధార్మిక సంస్థలు ఆందోళన చేయడంతో పాటు హిందువుల మనోభావాలు కు సంబంధించిన విషయం కావడంతో అగ్నిప్రమాదం పై సమగ్ర దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో జరిపించడానికి ప్రభుత్వం సిద్దపడి కేసును వారికి అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది.

1.10 కోట్ల తో కొత్త రథం

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కొత్త రథం తయారీ పూర్తయింది. 1.10 కోట్ల రూపాయలతో ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సరి కొత్తగా తయారు చేయించింది. 40 అడుగుల పొడవు 21× 12.6 చదరపు అడుగుల వైశాల్యం తో ఏడు అంతస్తులతో మేర కొత్త రథం కనువిందుగా ఉంది. అద్వితీయ హంగులు అద్ది, దారువు తో దివ్యనామాలు, కళారూపాలను స్వామివారి తేజస్సు ఉట్టిపడేలా రథాన్ని తయారు చేయడం విశేషం. మొత్తం 65 మంది వరకు రథం తయారీలో పాలుపంచుకున్నారు. కళ్యాణోత్సవాలు లో ఈ కొత్త రథాన్ని అధిరోహించి లక్ష్మీ నరసింహ స్వామి వారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఎప్పుడు పాత చీకటి రోజులను గుర్తు చేసుకునే కన్నా, చెడు జ్ఞాపకాలను నుంచి బయటకు వచ్చి కొత్తతరహా ఆలోచనలతో ముందుకు వెళితే ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అనడంలో సందేహం లేదు.