iDreamPost
android-app
ios-app

మా గెలుపును వారు జీర్ణించుకోలేకపోతున్నారు – సీఎం జగన్‌

మా  గెలుపును  వారు  జీర్ణించుకోలేకపోతున్నారు – సీఎం జగన్‌

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలతో ఇలాంటి ఫలితాలు వచ్చాయని అభివర్ణించారు. ఇలాంటి ఫలితాలు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.

ఏడాదిన్నర క్రితమే ఈ ఎన్నికలు పూర్తి అయి ఉంటే కోవిడ్‌ సమయంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే వీలుండేదని సీఎం జగన్‌ అన్నారు. కనీస ఇంగిత జ్ఞానంలేని ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు జరగకూడదని, అవరోధాలు కలిగించాలని కుట్రలు చేసిందన్నారు. కోర్టుల్లో కేసులు వేసిందని మండిపడ్డారు.

ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీలేదన్నారు వైఎస్‌జగన్‌. ఆ పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు కూడా ఈ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ పోటీలో లేకపోవడంతోనే వైసీపీ గెలుపు సునాయాసనమైందని ఈనాడు రాసిన వార్తను మీడియా సమావేశంలో సీఎం చదివి వినిపించారు. ఓటమిని అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు కూడా ఉందన్నారు. తమ గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి వార్తలు రాస్తున్నారని తూర్పారబట్టారు.

Also Read : రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే

ఈ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరిగాయని జగన్‌ గుర్తు చేశారు. పార్టీలు బీ ఫాం ఇస్తే.. వాటి ఆధారంగా ఎన్నికల సంఘం పార్టీ గుర్తులు కేటాయించిందన్నారు. ప్రజలు దీవెనలు తమకు ఇస్తే.. జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 95 శాతం హామీలను అమలు చేయడంతో ప్రజల మన్ననలను పొందామని జగన్‌ వివరించారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, అవరోధాలు కల్పించాలని రకరకాల శక్తులు పని చేస్తున్నాయని సీఎం జగన్‌ విమర్శించారు. ఓ వైపు కరోనా, మరో వైపు ఈనాడు, జ్యోతి, టీవీ5లు ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లుగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. వాళ్ల మనిషి సీఎంగా లేడనే ఈరకమైన రాతలు రాస్తున్నాయన్నారు. వాళ్ల మనిషిని ఎప్పుడెప్పుడు సీఎం సీటుపై కూర్చొపెడదామనేలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఆయా మీడియా సంస్థల తీరును ఎండగట్టారు.

ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న అడుగులు ముందుకు పడకూడదని కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్‌ ఆరోపించారు. బూటకపు వార్తలు రాయడం, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ప్రభుత్వం చల్లగా నడుస్తోందన్నారు. ఇంకా ఎక్కువ కష్టపడతామని, ఇంకా ఎక్కువ మంచి చేసేందుకు పని చేస్తామని సీఎం జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.

Also Read : పరిషత్‌లోనూ ఫ్యానుదే హవా – 13 జిల్లాల ఫలితాలు