iDreamPost
android-app
ios-app

ప్రతిపక్షం కాదట.. అంతకు మించి..

ప్రతిపక్షం కాదట.. అంతకు మించి..

ప్రజా స్వామ్యంలో అధికారపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంటుంది. ఇలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేందటున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఈ రోజు జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన తర్వాత జగన్‌ మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్న సీఎం మాటలతో సభికులు, టీవీల ముందు జగన్‌ ప్రసంగాన్ని చూస్తున్న ప్రజలు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. ఇదేంటి.. మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నేతృత్వంలో అధికారిక లెక్కల ప్రకారం 23 మంది వాస్తవంగా 21 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం ఉంటే.. జగన్‌ ఏమిటి లేదంటున్నారు..? అని ఆలోచించసాగారు.

ప్రజల ఆలోచన ముగిసేలోపే.. జగన్‌ అసలు విషయం చెప్పేశారు. దాంతో ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదట… అంతకు మించినది ఉందంటున్నారు సీఎం జగన్‌. ప్రతిపక్ష పార్టీ నేతలను, వారికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థల యాజమాన్యాలను.. సీఎం జగన్‌ రాక్షసులు, ఉన్మాదులతో పోల్చారు. తాను ప్రతిపక్షంతో యుద్ధం చేయడంలేదని, రాక్షసులు, ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నానని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఎక్కడా తప్పు జరగకుండా పాలన సాగిస్తుంటే.. ఎదో జరిగిపోతుందంటూ అసత్యాలు రాస్తున్నారని ఓ వర్గం మీడియాపై సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు పోతున్నాయంటూ.. డబ్బులిచ్చి మరీ రాయిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్ష పార్టీ నేతలను, వారికి వంత పాడుతున్న వారిని సీఎం జగన్‌ సరికొత్తగా పోల్చారు. మునుపెన్నడూలేని విధంగా రాక్షసులు, ఉన్మాదులతో పోల్చుతూ.. వారు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, చేనేత సంక్షేమం, ఆటోవాలాలు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా పరిపాలన సాగిస్తుంటే.. పని గట్టుకుని బురదజల్లుతున్న ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడుతున్న ఓ వర్గం మీడియా ఎలా వ్యవహరిస్తుందో.. రక్షసులు, ఉన్మాదులు అనే రెండు పదాల ద్వారా జగన్‌ చాటి చెప్పారు. మరి ఈ మాటలుకు చంద్రబాబు అండ్‌ కో.. ఎలా స్పందిస్తుందోనని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.