iDreamPost
android-app
ios-app

వేల కోట్లు మిగులుస్తున్న జ‌గ‌న్ నిర్ణ‌యం.. ఇదే నిద‌ర్శ‌నం..!

వేల కోట్లు మిగులుస్తున్న జ‌గ‌న్ నిర్ణ‌యం.. ఇదే నిద‌ర్శ‌నం..!

సంక్షేమ పాల‌న‌లో వేలాది కోట్ల రూపాయ‌లను నేరుగా ప్ర‌జ‌ల‌కే అందిస్తున్న ఏపీ సీఎం జ‌గన్.. పాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల ద్వారా వేలాది కోట్లను ఏపీ ఆర్జిస్తోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది నెల‌ల‌కే తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్ ద్వారా భారీ ఎత్తున ప్రజా ధనం ఆదా అవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టగానే టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తద్వారా ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.3885.47 కోట్లు ఆదా అయినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

పది లక్షల రూపాయలకు మించి ప్రభుత్వ కొనుగోళ్లు, పనులకు సంబంధించి ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా 2019లో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో గత ఆర్థిక (2020–21) ఏడాదిలో వివిధ పనులకు సంబంధించి 271 టెండర్లకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా 1,838.67 కోట్ల ప్రభుత్వ ధనం ఆదా అయిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొనసాగుతున్న పనులతో పాటు కొత్త పనులకు టెండర్‌ కమ్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. పనులకు సంబంధించి తొలుత టెండర్లలో ఎల్‌–1గా నిలిచిన ఏజెన్సీ కోట్‌ చేసిన ధరపై తిరిగి రివర్స్‌ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎల్‌–1 ఏజెన్సీ కోట్‌ చేసిన ధర కన్నా తక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల అవసరాలకు వస్తువులు, ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర కొనుగోళ్లకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌) ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. గత ఆర్థిక ఏడాది (2020–21)లో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సేవలకు సంబంధించి రూ.32,777 కోట్ల విలువగల 45,500 టెండర్లకు రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేశారు. తద్వారా రూ.2,046.80 కోట్లు ఆదా చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫోన్లు, సిమ్‌ కార్డులు, ఇతర కొనుగోళ్లకు కూడా ఇదే విధానం అమలు చేసినట్లు సర్వే పేర్కొంది. ప్రభ్వుత్వ స్కూళ్లలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు, ఫర్నీచర్, టీవీలు, అల్మారాలు తదితర పరికరాల కొనుగోళ్లకు కూడత్వీ విధానం అమలు చేశారు. ఎక్కడా టెండర్ల ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.