iDreamPost
android-app
ios-app

గ్రామాలకు జీవం పోస్తున్న సీఎం జగన్

  • Published Jul 22, 2020 | 7:34 AM Updated Updated Jul 22, 2020 | 7:34 AM
గ్రామాలకు జీవం పోస్తున్న సీఎం జగన్

దీనావస్థలో మన బడులు, ఉపాధి లేక వలస పోతున్న మత్య్సకారులు, చితికిపోతున్న నేతన్న, చతికిలపడిన పాడి రైతు అంటూ దశాబ్దాలుగా రోజు మనకు వార్తా పత్రికల్లో పేజీకి ఒకటి చొప్పున కనిపించే సంగతలను చూస్తూ ఆ జీవన విధానానికి సగటు మనిషిగా అలవాటు పడిపోయాం. నిజమైన అభివృద్ది గ్రామాల నుండే మొదలవ్వాలని, గ్రామాలు ఆర్థిక ప్రగతిని సాధించకుండా సామాజిక న్యాయాన్ని సాధించలేవని, రాష్ట్రం కానీ దేశం కాని అభివృద్ది దిశగా అడుగులు వేయాలి అంటే గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించితేనే అది సాధ్యం అని చెప్పిన మహనీయుల మాటలను లెక్క చేయక ప్రభుత్వాలే సరళీకరణ విధానాలతో గ్రామీణ ప్రజలకు అందవలసిన అభివృద్దిని వారికి అందనీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే 2019 ఎన్నికల తరువాత అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన వై.యస్ జగన్ గత పాలకులకు భిన్నంగా గ్రామీణాభివృద్దే తమ మొదటి లక్ష్యంగా అడుగులు వేస్తు అనేక విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపోందించారు. గత పాలకులు చూపిన నిర్లక్ష్యం వలన జీవం కోల్పోయిన విద్యా , వైద్యం , ఉపాది అనే మూడు మౌళిక సదుపాయాలు ప్రతీ గ్రామలో ఉండేలా తిరిగి ప్రాణం పోస్తు, ప్రైవేటు సంస్థలకు చెక్ పెడుతు గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామీణాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను ప్రైవేటు బడులకు ధీటుగా తీర్చి దిద్దుతూ , గ్రామీణ బాలబాలికలు చదువుకునేలా అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ, ప్రతి బడిలో ఇంగీషు మీడియాన్ని ప్రవేశపెట్టారు, అలాగే విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించడం దగ్గర నుండి యూనిఫాం , పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు, ఆర్ధిక ఇబ్బందుల వలన ఏ విద్యార్ధి కూడా ప్రాధమిక హక్కు అయిన చదువుకు దూరం అవ్వకూడదని అమ్మఒడి ద్వార పిల్లల తల్లి ఖాతాలోకి నేరుగా డబ్బును వేస్తు వారికి ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో ఏళ్ళుగా సమాజంలో వేళ్లూనుకొన్న ప్రైవేటు విద్యాసంస్థలకు పరోక్షంగా చెక్ పెట్టారు . ఇదే నాడునేడు లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రుల ప్రమాణాలు పెంచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తూ , 5 లక్షల వార్షిక ఆదాయం కన్న తక్కువ ఉన్న వారికి ఆరోగ్యశ్రీ అందిస్తూ ఆరోగ్య భరోసా కల్పించారు.

వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమ చేనేత. కానీ ప్రైవేటు వేటుకు గురై నేతన్న అప్పులపాలై మగ్గాలు నిలిచి పరిశ్రమ స్థంబించినా గత పాలకులు రుణమాఫీలు , వేయి కోట్ల బడ్జెట్ , ఐదు వేల కోట్ల స్థిరీకరణ అంటూ హామీలు గుప్పించారే కానీ ఆదుకున్న పాపాన పోకపోగా పవర్ లూం యజమానులకు కొమ్ముకాస్తు వారి ఉపాధి దెబ్బతీసారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ద్వారా సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నరు. అంతేకాకుండా అమెజాన్- ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో ఆన్లైన్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత నవంబర్ 1వ తేదీ నుంచే అమ్మకాలు ప్రారంభించి ఎప్పటి నుంచో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అనే పెద్ద సమస్యకు పరిష్కార మార్గం చూపారు.

సముద్ర తీరప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు గత పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపడం వలన ఉపాదిలేక గుజరాత్, కలకత్తా లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళేవారు. మత్స్యకారుల ఉపాధి రోజు రోజుకు దీనావస్థకి చేరుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. గుజరాత్ వలస వెళ్ళి పాకిస్తాన్ సైనికులకి చిక్కి ఉత్తరాంద్ర జాలర్లు పాకిస్తాన్ జైల్లలో మగ్గినా వారిపై కనికరం కలగలేదు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వారి ఖాతాల్లోకి వేట నిషేధిత సమయంలో 10వేలు జమచేస్తున్నారు. డీజిల్‌ సబ్సిడీని 6.03 రుపాయలు నుంచి 9 రూపాయలు చేశారు. పాకిస్తాన్‌ జైల్లలో మగ్గిన మత్య్సకారులని తిరిగి వారి కుటుంభసభ్యుల దగ్గరకి చేర్చడమే కాకుండా వారి జీవనోపాది ఇక్కడే మెరుగు పడేలా శాశ్వత పరిష్కారంగా 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు , 1 ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రాన్ని దాదాపు రూ. 3వేల కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించబోతునట్టు ప్రకటించారు . అలాగే గ్రామాల్లో బెల్టు షాపులు, పర్మిట్ రూం లు తొలగించడంతో పాటు మద్యం పేదవాడికి అందనంత దూరంలో పెట్టడంతో మత్తులో జోగిన పల్లె జీవనం తిరిగి గాడిలో పడుతుంది.

ఇప్పటికే విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ సంస్ధలను బలోపేతం చేస్తు గ్రామాల్లో పరోక్షంగా ఆర్ధిక ప్రగతికి బాటలు వేసిన జగన్ సర్కార్ ఇక తాజాగా పాల ఉత్పత్తిలోనూ ప్రైవేటు సంస్ధలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేసింది. రాష్ట్రంలో కుంటు పడిన పాడిపరిశ్రమకు మహర్దశ తీసుకుని వచ్చేలా ప్రణాళికలు రూపొందించిది . అందులో భాగంగా గుజరాత్ కు చెందిన సహకార దిగ్గజం అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో హమీగా ఇచ్చినట్టుగా సహకార రంగంలో నడిచే డెయిరీలకు జీవం పోసే క్రమంలో ఆ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయలు చొప్పున బోనస్‌ ఇవ్వనున్నారు. అలాగే పాడిపశువుల బీమా పథకాన్ని అమలులోకి తెస్తున్నారు. దేశీయ పాడి ఆవులకు రూ.10వేలు, సంకరజాతి పాడి ఆవులకు రూ.30వేలు చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 4.5 లక్షల పాడి ఆవులకు బీమా సౌకర్యం లభిస్తుందని తెలుస్తుంది. వీటితో పాటు అమూల్ తో ఒప్పందంతో ఏపీ పాడిరైతులకు మెరుగైన ధర దక్కడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే సహకార సంఘాల డెయిరీలకు ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ప్రపంచస్థాయి డెయిరీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చి విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలు పెరిగే వీలుందని తెలుస్తుంది.

ముఖ్యమంత్రిగా జగన్ గెలిచిన ఏడాదిలోనే గ్రామీణాభివృద్దికి తోడ్పడుతూ, గ్రామస్థాయికి విస్తరించిన ప్రయివేటు భూతాన్ని అదుపుచేస్తూ, గ్రామీణ ప్రజల ఆర్ధిక ప్రగతి పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని త్వరితగతిన అమలుపరచడం హర్షించదగ్గ విషయం.