Idream media
Idream media
కరోనా కల్లోల సమయంలో దేశ ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాపార ధోరణిలో వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను డబ్బుతో ముడిపెట్టింది. రాష్ట్రాలకు కేంద్రం తరఫున సలహాలు, సూచనలు ఇవ్వడం తప్ప సాయానికి మాత్రం ముందుకు రావడం లేదు. అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడమే గానీ, ఆర్థిక సహకారానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మెండిచేయి చూపుతోంది. తాజాగా వ్యాక్సిన్‌ల విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తోంది.
అంతర్జాతీయంగా గొప్ప పేరు కోసం ఇతర దేశాలకు కోట్లకు కోట్లు వ్యాక్సిన్‌లను పంపిన కేంద్రం.. మన దేశ ప్రజలకు మాత్రం కొరత పెడుతోంది. రాష్ట్రాలన్నీ వ్యాక్సిన్‌లు ఇవ్వండి మహా ప్రభో అని మొత్తుకున్నా అరకొరగానే పంపిణీ చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రాల డిమాండ్‌కి తగినట్లుగా నేరుగా కొనుగోలు చేసుకునే వీలు కల్పించింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు, ప్రైవేటు ఆస్పత్రులు.. ఓపెన్ మార్కెట్‌లకు మరో రేటుకు అమ్మాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రానికి 150 రూపాయలకే వ్యాక్సిన్ డోసును ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం 400 రూపాయలుగా, ఇక ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలుగా డోసుల ధరలను నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫ్రెంట్ లైన్ వారియర్స్, 45 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేసిన ప్రభుత్వం… తాజాగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ ఉచితంగా అందజేయనుంది.
మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది. తాజా నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.