iDreamPost
iDreamPost
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెప్పారు. దాన్నే ఆచరిస్తున్నారు. అయితే పొరుగున ఉన్న ఒడిశాతో పలు ప్రాజెక్టులకు సంబంధించి దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్నాయి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొటియా, మరికొన్ని గ్రామాల విషయంలోనూ వివాదాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆయా గ్రామాల్లో తరచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని నేరడీ, విజయనగరం జిల్లాలో జంఝావతి, గోదావరి జిల్లాల్లో పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి భూములు, ముంపు సమస్యలపై చర్చించి పరిష్కారం సాధించేందుకు ఏప్రిల్ నెలలోనే జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. దానికి నవీన్ సానుకూలంగా స్పందించడంతో జగన్ ఒడిశా పర్యటనకు మంగళవారం వెళ్తున్నారు.
నేరడికి భూ సమస్య
ఒడిశా నుంచి ఏపీలోకి ప్రవహిస్తున్న వంశధార నదిలో వరద నీటిని ఒడిసిపట్టి రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు వీలుగా రెండు దశల్లో వంశధార ప్రాజెక్ట్ నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య 1962లోనే ఒప్పందం కుదిరింది. వంశధారలో లభ్యమయ్యే 115 టీఎంసీల నీటిని చెరి సగం వాడుకోవాలనుకున్నారు.దాని ప్రకారం మొదటి దశలో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా వద్ద బ్యారేజ్ నిర్మించి 1978 నుంచి లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
ఇక రెండోదశలో 16 టీఎంసీల నీటిని నిల్వ చేసి.. 1.07 లక్షల ఎకరాలకు నీరు అందించేలా నేరడీ బ్యారేజ్, కుడి ప్రధాన కాలువ, వరద కాలువ నిర్మించాల్సి ఉంది. భామిని మండలం నేరడీ వద్ద ప్రతిపాదించిన బ్యారేజి నిర్మాణం వల్ల ఒడిశా భూభాగంలో 106 ఎకరాలు మునిగిపోతాయి. ఆ భూమిని ఇచ్చేందుకు మొదట అంగీకరించిన ఒడిశా.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. 106 ఎకరాల కంటే ఎక్కువ భూమే మునిగిపోతుందని వాదించడం ప్రారంభించింది. దీంతో వివాదం మొదలైంది. వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వివాద పరిష్కారానికి వంశధార ట్రిబ్యూనల్ ను నియమించింది. జూన్ 22న ట్రిబ్యునల్ ఏపీకి అనుకూలంగా నివేదిక ఇచ్చింది.
నేరడీ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ దాని వల్ల ముంపునకు గురయ్యే 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వమే సేకరించి ఏపీకి ఇవ్వాలని సూచించింది. నేరడీ కుడికాలువ ద్వారా రోజూ 8వేల క్యూసెక్కులు వాడుకోవడానికి ఏపీకి, ఎడమ కాలువ ద్వారా విడుదలయ్యే నీటిని వాడుకునే హక్కు ఒడిశాకు కల్పించింది. నిర్మాణ వ్యయాన్ని వాడుకునే నీటి ఆధారంగా రెండు రాష్ట్రాలు భరించాలని పేర్కొంది.
Also Read:నేరడి బ్యారేజ్ వైపు జగన్ ముందడుగు
కాగా వైఎస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టు విస్తరణ చేపట్టారు. కొత్తగా హిరమండలం వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగిడి, పారాపురం వద్ద మినీ రిజర్వాయర్లు నిర్మించి.. నదిలో వరద ఉన్న సమయంలో నీటిని ఆ రిజర్వాయర్లకు మళ్లించి నిల్వ చేయడం ద్వారా మరో 2.50 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని సంకల్పించారు. అయితే ఇవన్నీ సాకారం కావాలంటే.. ఎగువన ప్రతిపాదించిన నేరడీ బ్యారేజి నిర్మాణం పూర్తి కావాలి. అది వివాదంలో చిక్కుకోవడంతో.. నాటి ప్రభుత్వం వంశధార రెండోదశ ప్రాజెక్టును రెండుగా విడదీసింది. స్టేజ్ వన్ లో కుడి ప్రధాన కాలువ, వరద కాలువ పనులతో పాటు 1600 కోట్లతో ప్రతిపాదించిన హిరమండలం రిజర్వాయర్ పనులు చాలావరకు పూర్తి చేసింది. నేరడీ భూ సమస్య తొలగిపోతే స్టేజ్ 2లో ఆ పనులు చేపడతారు. ఇవన్నీ పూర్తి అయితే ఉద్దానం ప్రాంతానికి నీటిని తరలించగలగడంతో పాటు.. వంశధార, నాగావళి నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది.
పోలవరం ముంపు వివాదం
రాష్ట్రానికి వరదాయినిగా భావిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితం అయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎట్టకేలకు నిర్మాణం ప్రారంభించినా ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లోని వేల ఎకరాల భూములు మునిగిపోతాయని ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీనికి సంబంధించి 1980 ఏప్రిల్ రెండో తేదీన ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశాల మధ్య ఒప్పందం కుదిరింది. ముంపు ముప్పు లేకుండా సీలేరు, శబరి నదులపై కరకట్టలు నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఆదేశించింది.
ఆ ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ., శబరిపై 18.2 కి.మీ. నిడివిన.. 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టల నిర్మాణానికి రూ. 378.69 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే చత్తీస్గఢ్ లో శబరిపై 25.19 కి.మీ., ఇతర వాగులపై 3.93 కి.మీ. నిడివిన 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి రూ.332.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే పోలవరం ప్రాజెక్టును 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి తమ భూభాగం ముంపునకు గురికాకుండా చూడాలని 2007 ఏప్రిల్ మూడో తేదీన జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, చత్తీస్గఢ్ కోరాయి. ముఖ్యంగా పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ముంపునకు గురవుతాయని ఒడిశా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గోదావరికి వరద వచ్చే సమయంలో స్పిల్ వే నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని అంచనా వేశారు. దాని ప్రకారం 41.15 మీటర్ల ఎత్తులో డ్యాం నిర్మిస్తే చాలని.. బ్యాక్ వాటర్ సమస్య ఉండదని ఏపీ వాదిస్తోంది. మరోవైపు కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ఒడిశాలోని మల్కనగిరి, చత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరుతూ
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పలుమార్లు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసినా ఫలితం లేదు. 2022 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని జగన్ భావిస్తున్నారు.
జంఝావతి జంఝాటం
విజయనగరం జిల్లాకు మేలు చేసే జంఝావతి ప్రాజెక్టుదీ ఇటువంటి సమస్యే. జంఝావతి నదిలో నికర నీటి లభ్యత 8 టీఎంసీలుగా నిర్ధారించారు. ఆ మేరకు ఆంధ్ర, ఒడిశాలు చెరి సగం నీటితో ప్రాజెక్టులు కట్టుకునేలా 1978 డిసెంబర్ 25న ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు 3.40 టీఎంసీల సామర్థ్యంతో జంఝావతికి ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా 2004లో శ్రీకారం చుట్టారు. కొమరాడ మండలం రాజ్యలక్ష్మి పురం వద్ద శంకుస్థాపన చేశారు.
జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోని 1175 ఎకరాలు ముంపునకు గురవుతాయని ఒడిశా అభ్యంతరం తెలిపింది. ఆ భూమి ఇస్తే పరిహారం చెల్లిస్తామని ఆంధ్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒడిశా తిరస్కరించింది. దాంతో అప్పటి సీఎం వైఎస్ కాంక్రీటు డ్యామ్ బదులు తాత్కాలికంగా రబ్బర్ డ్యామ్ నిర్మించి 2006 జనవరి ఒకటో తేదీన 9వేల ఎకరాలకు నీరందించడం ప్రారంభించారు. భూ సమస్య పరిష్కాారం అయి కాంక్రీటు డ్యామ్ నిర్మిస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఒడిశా సరిహద్దుల్లో ఉన్న పలు గ్రామాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా సాలూరును ఆనుకొని ఉన్న 21 కొటియా గ్రామాలు తమవేనని ఒడిశా వాదిస్తోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఈ వివాదం అపరిష్కృతంగా ఉంది. వీటిపై ఒడిశా సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచిస్తూ సమస్య తేలే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఒడిశా దాన్ని ఉల్లంఘించి కొటియా గ్రామాలను తనలో కలిపేసుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తోంది. దాంతో ఏపీ కూడా ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులను ముమ్మరం చేసింది.
Also Read:సరిహద్దు గ్రామాలపై ఒరిస్సా జగడం!!!
పలు సందర్భాల్లో ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చి బెదిరింపులకు, అడ్డగింతలకు దిగుతుండటంతో గ్రామాల ప్రజలు తాము ఆంధ్రలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలతో ఇటీవలి కాలంలో కొటియా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటిపైనా చర్చించి సామరస్య పూర్వక పరిష్కారాలు సాధించే ప్రయత్నంలోనే సీఎం జగన్ ఒడిశా సీఎంతో భేటీ కానున్నారు.