iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన

ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర హోం శాఖా మంత్రితో సమావేశమయ్యారు. విభజన హామీలు, మూడు రాజధానులు తదితర అంశాలపై హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ రోజు ఉదయం కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రాజెక్టు సవరించిన అంచనాలు 55,656 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. భూ సేకరణ, పునరావాస పనులకు అయ్యే అయిన ఖర్చును రీయంబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

గోదావరి – కావేరి నదుల అనుసంధానంపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. ఈ రెండు నదులను అనుసంధానించడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అవుతందని జగన్‌ యోచిస్తున్నారు. ఈ మేరకు నదుల అనుసంధానంపై గజేంద్ర షెకావత్‌తో చర్చించారు. సీఎం జగన్‌ విజ్ఞప్తి మేరకు నదుల అనుసంధానంపై ఆ రాష్ట్రంలో పర్యటించి, చర్చించాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను కేంద్ర మంత్రి ఆదేశించారు. శ్రీరామ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి ఆహ్వానించారు. గోదావరి, కావేరి నదులలో నీటి లభ్యత, అనుసంధానానికి అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలు, సమస్యలపై కులాంకషంగా రాష్ట్ర అధికారులతో చర్చించిన తర్వాత శ్రీరామ్‌ నివేదికను కేంద్ర మంత్రికి ఇవ్వనున్నారు.