iDreamPost
android-app
ios-app

కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. వారందరికీ శుభాకాంక్షలు

కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. వారందరికీ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను సీఎం ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఏపీ లోక్ సభ నియోజకవర్గం ప్రామాణికంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇక మీదట ఇకపై రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఉదయం 9.05 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఇతర శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.పరిపాలన సౌలభ్యాన్ని,వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. గతంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాలను అలాగే కాపాడామని పేర్కొన్న ఆయన 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్ లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయని ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో ఏర్పడిన కొత్త జిల్లాలు అని అన్నారు. దేశంలో 727 జిల్లాలు ఉన్నాయని అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 70 జిల్లాలు ఉన్నాయని ఆయన అన్నారు. అతి తక్కువగా గోవాలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

ఇక అతి చిన్న రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 25 జిల్లాలు ఉన్నాయని పేర్కొన్న జగన్ 2011లో చివరి జనాభా ప్రకారం ఒక్కో రాష్ట్రంలో సగటు జిల్లా జనాభా 38 లక్షల 15 వేలుగా ఉందని అన్నారు. ఇక కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు విజ్ఞప్తి మేరకు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా…రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని, ఆయన రెవెన్యూ డివిజన్ కావాలని కోరడంతో కుప్పం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశామని అన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని, పాలనా వికేంద్రీకరణే ప్రజలకు మేలు చేస్తుందని, గ్రామం నుంచి రాజధానుల వరకు ఇదే మా విధానం అని మరోసారి తేల్చి చెప్పారు.