Idream media
Idream media
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా విలయ విధ్వంసమే. దీన్ని నుంచి బయట పడేందుకు దాదాపు 18 రాష్ట్రాలు లాక్ డౌన్, మినీ లాక్ డౌన్ బాట పట్టాయి. కేంద్రం నిర్ణయం కోసం వేచి చూసి ఆయా రాష్ట్రాలే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా కేసులు, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్, ఇంజక్షన్లు తదితర ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. ఇతర అంశాలపై దృష్టి పెట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం సహా రాష్ట్రాల పాలన కుంటు పడిందనే చెప్పాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వంటి చోట్ల .. ఎక్కడా సీఎంలు పాలనపై దృష్టి పెట్టడం లేదు. కేవలం కరోనాను ఎలా ఎదుర్కొనాలి.. ఆర్థికంగా ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలను ఎలా తట్టుకోవాలి? కేంద్రం నుంచి టీకాలు ఎన్ని తెచ్చుకోవాలి? అనే అంశాలపైనే ఆలోచిస్తున్నారు. కేవలం కరోనా కార్యకలాపాలకే పరిమితం కావాలని కొన్ని ప్రభుత్వాలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి కూడా. కానీ, ఒక్క రాష్ట్రంలో మాత్రం ఊహించని పాలన సాగుతోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఒకలా, ఆంధ్రప్రదేశ్ సహా అతి తక్కువ రాష్ట్రాల్లో పాలన ఒకలా కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలో అటు ఆరోగ్య భద్రతతో పాటు, కీలక కార్యక్రమాలపై జగన్ దృష్టి పెడుతూనే ఉన్నారు. సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శల దాడి చేస్తున్నా ఎక్కడా తొణికిసలాడకుండా అటు కరోనా నుంచి ప్రజలను కాపాడుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. పింఛన్లు ఆగకుండా అందజేశారు. అదేవిధంగా రేషన్ అందించారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు సహాయాలు అందిస్తూనే ఉన్నారు. రైతు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ చేయూత అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంగన్ వాడీలను బలోపేతం చేయడంతో పాటు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వసూలు చేసేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. టీకా విషయంలోనూ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇన్ని పనులు చేయాలంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలి. ఈ లెక్కన ఎంత లేదన్నా జగన్ రోజుకు 15 నుంచి 18 గంటలు ప్రజల గురించే ఆలోచిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఏదేనీ ఉప ద్రవం వచ్చి పడ్డప్పుడే నాయకుల సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుంది. కరోనా కాలంలో అటు ప్రజల ఆరోగ్య భద్రతపైనే కాకుండా, ఇటు వారి ఆర్థిక భద్రత గురించి కూడా ఆలోచిస్తూ జగన్ సాగిస్తున్న పాలనకు ప్రశంసలు అందుతున్నాయి.