iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో జ‌గ‌న్ స్టైలే వేరు

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో జ‌గ‌న్ స్టైలే వేరు

జ‌నాన్ని దోచుకునే కార్పొరేట్ సంస్థ‌ల‌పై క‌న్నెర్న చేయ‌డ‌మే కాదు, రాష్ట్రానికి స‌హాయం అందిస్తున్న కార్పొరేట్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు పేర్కొంటూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌త చాటుకుంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా గంద‌ర‌గోళానికి గురి అవుతున్నాయి. జ‌గ‌న్ దూరదృష్టి, చాక‌చ‌క్య పాల‌న ద్వారా ఏపీలో భ‌యంక‌ర ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు త‌న పిలుపుతో బ‌డా కార్పొరేట్ సంస్థ‌లు కూడా రాష్ట్రానికి స‌హాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నాయి. చాలా సంస్థ‌లు ఇప్ప‌టికే త‌మ వంతు తోడ్పాటునిచ్చాయి. కొవిడ్‌–19 సంక్షోభ సమయంలో ఆక్సిజన్‌ సరఫరా చేయడం ద్వారా రిలయన్స్, టాటాస్టీల్, జిందాల్‌ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ వంటి కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రానికి అండ‌గా నిలిచాయి. ఆయా సంస్థ‌ల‌కు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృతజ్ఞతలు పేర్కొని ప్ర‌త్యేక‌త‌ను చాటారు.

కొవిడ్ క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్న జ‌గ‌న్ ఆ దిశ‌గా భిన్న పంథాలో ముందుకు వెళ్తున్నారు. వీలైనంత వ‌ర‌కూ రాష్ట్రంలోనే స‌క‌ల‌ స‌దుపాయాలను స‌మ‌కూర్చుకుంటూనే, కేంద్రం, కార్పొరేట్ సంస్థ‌ల స‌హ‌కారం పొందేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా కోవిడ్‌–19కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్రానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరఫున ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పంపింది. ఈ మేర‌కు త‌మ‌కు మద్దతు తెలిపిన ముఖేష్‌ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందంటూ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్‌ నత్వాని ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేస్తూ సీఎం ట్వీట్‌ చేశారు.

‘ఈ కష్టసమయంలో పార్లమెంటు సభ్యుడు, జిందాల్‌ గ్రూపు చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ రాష్ట్రానికి అండగా నిలిచారని, ఈ కష్టకాలంలో జేఎస్‌పీఎల్‌ నుంచి రాష్ట్రానికి 500 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ పంపిన నవీన్‌ జిందాల్‌ను అభినందిస్తున్నా’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. అదే విధంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ 1,000 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ పంపిన టాటాస్టీల్, రాయలసీమ ప్రాంతానికి ఆక్సిజన్‌ సరఫరా చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సీఎండీ సజ్జన్‌ జిందాల్‌లకు సీఎం కృతజ్ఞతలు తెలియచేస్తూ మరో రెండు ట్వీట్లు చేశారు. జ‌గ‌న్ చేసిన ఈ ట్వీట్లు కార్పొరేట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీశాయి. స‌హాయం అందించేందుకు ముందుకు వెళ్లాల‌ని మ‌రికొంద‌రిని ఆలోచించేలా చేశాయి.