iDreamPost
android-app
ios-app

విశాఖ‌పై స్ప‌ష్ట‌మైన విజ‌న్

విశాఖ‌పై స్ప‌ష్ట‌మైన విజ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విశాఖ న‌గ‌రంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న అనంత‌రం ఇప్ప‌టికే విశాఖ‌పై ప్ర‌ముఖ సంస్థ‌ల దృష్టి ప‌డింది. పెట్టుబ‌డులు, కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మెట్రో నగరాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండే విశాఖపట్నాన్ని మరింతగా డెవలప్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా భావిస్తున్న వారికి.. విశాఖపై తనకున్న విజన్ ఏమిటన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో విశాఖకు రాజధాని తరలింపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా ఐటీతోపాటు ఇతర అంశాల ఎజెండాతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ నగర రూపురేఖలు మార్చేలా.. ఉక్కునగరానికి ఉన్న ఇమేజ్ కు ఐటీ ఇమేజ్ ను పెంచేలా కార్యాచరణ దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. విశాఖను ఐటీ హబ్ చేయటానికి అవసరమైన ప్రణాళికల్ని ఇప్పటికే సిద్ధం చేయటం తెలిసిందే. ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం ప్రధాన కేంద్రం అవుతుందన్నది సీఎం జగన్ ఆలోచన. ఇదే విషయాన్ని రివ్యూ సమావేశంలోనూ ఆయన పేర్కొన్నారు.

ఫ్యూచర్ లో ఐటీ రంగానికి విశాఖ మంచి కేంద్రంగా మారుతుందన్న ఆయన.. ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న విషయాన్ని వెల్లడించారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయాలన్న తన లక్ష్యాన్ని వెల్లడించారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు.. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖ స్థాయిని మరింత పెంచాయని.. భవిష్యత్తులో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుందన్నారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖకు తీసుకురావాలని.. ఆ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్ కు ఈ వర్సిటీ గమ్యస్థానం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఏపీలో ఏర్పాటయ్యే ప్రతి కంపెనీకి ప్రతి ఏడాది ఇన్సెంటివ్ ఇస్తామన్న ఆఫర్ ను ప్రకటించారు. కంపెనీ ఏర్పాటు చేసిన మొదటి ఏడాది పూర్తి అయిన వెంటనే ఇన్సెంటివ్ చెల్లింపులు ప్రారంభమవుతాయని చెప్పారు. దీంతో మన పిల్లలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని.. నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి విశాఖ ఇమేజ్ ను మార్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారన్న విషయం తాజా రివ్యూ స్పష్టం చేస్తుందని చెప్పాలి.