Idream media
Idream media
ప్రజలు దేనికోసమూ ఇబ్బందులు పడకూడదు.. ప్రభుత్వ సేవల విషయంలో ఆ పరిస్థితి అస్సలే రాకూడదు.. అన్నదే జగన్ సర్కారు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ స్థలాల పంపిణీతో పాటు .. ఇతర సేవలన్నీ ఇంటి ముంగిటకే వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు సర్కారు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు తమ సమస్యపై దరఖాస్తు చేసుకున్నప్పుడు.. అది ఏ అధికారి వద్ద ఏ దశలో ఉందన్న వివరాలను దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేసే ప్రక్రియను తెచ్చింది.
సార్.. మా దరఖాస్తును పరిశీలించారా.. అని కార్యాయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తదారుడికి సమాచారం వెళ్లేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ‘ఏపీ సేవ పోర్టల్’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ఏపీ సేవ పేరును ఈ పోర్టల్‌కు పెడుతున్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీ తనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం ఇది. ఏపీ సేవా పోర్టల్ ఓ గొప్ప ముందడుగు. గ్రామ స్వరాజ్యం గడచిన ఈ రెండేళ్లకాలంలో మన కళ్లముందే కనిపించేలా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది.
540కిపైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా దాదాపు 4 లక్షలమంది ఈ డెలివరీ మెకానిజంలో పనిచేస్తున్నారు. గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో నిరంతరం పనిచేస్తున్నారు. ఈ 4 లక్షలమంది సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేవలను మరింత మెరుగు పరుస్తూ ముందడుగు వేస్తూ 2.0ను ప్రారంభిస్తున్నామ’ని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
మీ సేవలో లేనివి సైతం..
నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలనే తేడా లేకుండా ప్రజలకు సొంతూరిలోనే దాదాపు అన్ని రకాల ప్రభుత్వసేవలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. మీ–సేవా కేంద్రాలలో సైతం అందుబాటులో లేని 220కి పైగా కొత్త సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. 2020 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వసేవలు ప్రజలకు అందాయి.
ఒకే పోర్టల్ పరిధిలోకి..
ప్రజల నుంచి అందే అర్జీలను ప్రస్తుతం సచివాలయాల సిబ్బంది ఎప్పటికప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. అర్జీ పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఆ సమాచారం సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు. కేవలం సంబంధిత శాఖ పరిధిలోనే ఆ వివరాలు ఉంటాయి. దీనివల్ల అర్జీదారుడికి దరఖాస్తు స్థితిగతులను సచివాలయ సిబ్బంది తెలియచేయలేకపోతున్నారు.
ఈ ఇబ్బందులన్నీ తొలగిస్తూ వివిధ శాఖలు ఆన్‌లైన్ ద్వారా అందజేసే సేవలన్నింటిని ఒకే పోర్టల్ పరిధిలోకి తెస్తున్నారు. తద్వారా సచివాలయాల సిబ్బందికి తమ పరిధిలోని అర్జీల పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. కొత్త సాఫ్ట్‌వేర్ పోర్టల్ ప్రకారం ఒక అధికారి వద్ద అర్జీ ఎంతకాలం పెండింగ్‌లో ఉందన్న వివరాలను సచివాలయ శాఖ తెలుసుకునే వీలుంటుంది.