iDreamPost
iDreamPost
పక్షం రోజులు నిండకముందే సీఎం మరోసారి హస్తిన బాట పడుతున్నారు. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు. మంగళవారం ప్రధానితో భేటీ కి అపాయింట్ మెంట్ ఖరారయ్యింది. దాంతో ఇది కీలక సమావేశంగా అంతా భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఢిల్లీ పర్యటనలోనే సీఎం జగన్ నేరుగా మోడీతో సమావేశం కావాల్సి ఉంది. అయినప్పటికీ అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ వంటి నేతలతో జగన్ సమావేశమయ్యారు.
ఏపీలో రాజకీయాలు కీలక మార్పులకు పీఎంతో సీఎం భేటీ దోహదపడే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ పరిస్థితి తలకిందులయ్యింది. మనుగడ కోసం తల్లడిల్లిపోతోంది. దాంతో బీజేపీ దూకుడు పెంచింది. ఏపీ బీజేపీలోని ఓవర్గం నేతలు జగన్ మీద దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ నేతలు మాత్రం జగన్ కి అన్ని విధాలా చేదోడుగా ఉంటున్నారు. ప్రధానమైన అంశాల్లో సహాయం అందిస్తున్నారు. అదే రీతిలో జగన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తున్నారు. కీలక బిల్లుల విషయంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. దాంతో మోడీ-జగన్ మధ్య మితృత్వం బలపడుతున్నట్టు కనిపిస్తోంది. అది మింగుడుపడని నేతలు దానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రయత్నంలో బోల్తా పడుతున్నారు.
ఇప్పటికే ఏపీకి రావాల్సిన నిధులు సహా అనేక కీలక విషయాలను అమిత్ షా ముందు జగన్ ప్రస్తావించారు. విశాఖ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీని ఆహ్వానించాలన్న తన మనుసులో మాటను బయటపెట్టారు. వాటికి తోడుగా అమరావతి స్కామ్, ఫైబర్ గ్రిడ్ పేరుతో సాగించిన అక్రమాలపై దర్యాప్తు కోసం జగన్ పట్టుదలతో ఉన్నారు. దానికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించడంతో మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీబీఐ రంగంలో దిగే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో కోర్ట్ ఉత్తర్వుల ద్వారా విచారణను అడ్డుకుంటున్న తీరు మీద ఇప్పటికే పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. దానికి తగ్గట్టుగానే ఏపీ హైకోర్ట్ కూడా తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్ట్ తీరు, పర్యావసానాలు కూడా ఈ ఇద్దరి నేతల మధ్య భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పోలవరం సహా పలు అంశాలు కూడా జగన్ పీఎంకి వినతిపత్రం అందించబోతున్నారు. జీఎస్టీ బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీలో ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న విషయాన్ని కూడా సీఎం కేంద్రం దృష్టికి తీసుకెళతారు. కేంద్ర సహాయం పెంచాలని కోరబోతున్నారు. అన్నింటికీ మించి రాజకీయంగా జగన్, మోడీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా టీడీపీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. బీజేపీతో జతగట్టాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. కానీ పరిస్థితి అనుకూలించడం లేదు. ఈ తరుణంలో మోడీ , జగన్ ఓ నిర్ణయానికి వస్తే టీడీపీకి పూర్తిగా తలుపులు మూసివేయడమే కాకుండా, చంద్రబాబుకి చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ సమావేశం అత్యంత ఆసక్తిగా మారబోతోంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఆస్కారం ఇవ్వబోతోందనే చెప్పవచ్చు.