Idream media
Idream media
అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా సిద్ధమయ్యారు. పీఆర్‌సీపై ఉద్యోగుల వినతులను స్వీకరించేందుకు స్వయంగా వారితో భేటీ అయ్యారు. పీఆర్‌సీపై జరుగుతున్న పంచాయితీకి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగ సంఘాల వినతులను, వారు పేర్కొన్న అంశాలనూ సావధానంగా విని, అన్నీ నోట్ చేసుకున్నారు. వారి వినతులపై సానుకూలంగా స్పందించారు. రెండు మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
రెండు నెలలుగా పీఆర్‌సీపై ఏపీలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అశుతోష్ మిశ్రా నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. పలుమార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినా లాభం లేకపోయింది. దీంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపాయి. ఆ తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా జేఏసీలతో చర్చలు జరిపారు. ఈలోపే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత కూడా పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ప్రభుత్వం.
ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు జగన్. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని …. మనసా, వాచా మంచి చేయాలనే తపనతోనే ఉన్నానని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతానని చెప్పారు. పీఆర్‌సీపై అప్పుడు తుది ప్రకటన చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ నోట్ చేసుకున్నారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని చెప్పారు. వీలైనంతగా మంచి చేయాలన్న తపనతో ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు జగన్. ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా… అందరూ కాస్త ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతా సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు జగన్.