iDreamPost
android-app
ios-app

వైభవంగా బొత్స కుమారుడి వివాహం.. వియ్యంకులైన వైసీపీ నేతలు.. హాజరైన జగన్‌

వైభవంగా బొత్స కుమారుడి వివాహం.. వియ్యంకులైన వైసీపీ నేతలు.. హాజరైన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్‌ సందీప్‌కు ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తమ్ముడు బాలకృష్ణ కుమార్తె పూజితనిచ్చి వివాహం చేశారు. గత డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. నూతన వధూవరులకు సీఎం జగన్‌ తన ఆశీర్వచనాలు అందించారు. ఈ పెళ్లి వేడుకకు మంత్రి కేటీఆర్‌తోపాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

బొత్స సత్యానారాయణ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌ అకాల మరణం తర్వాత.. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన నేతల్లో బొత్స కూడా ఒకరు. కిరణ్‌కుమార్‌ రెడ్డితో పోటా పోటీగా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదిపారు. 2011 నుంచి 2014 వరకు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు.

కదిరి బాబూరావు టీడీపీ నుంచి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన కదిరి బాబూరావు.. 2004లో తొలిసారి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సినీ నటుడు బాలకృష్ణకు కదిరి బాబూరావు మంచి స్నేహితుడు. 2009లో కనిగిరిలో టీడీపీ తరపున కదిరి బాబూరావు వేసిన నామినేషన్‌ చెల్లకుండా పోయింది. 2014లో మరోసారి కనిగిరి నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో దర్శికి అయిష్టంగా వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

ఇప్పుడు.. వైసీపీ ముఖ్యనేతలలో ఒకరు, సీనియర్‌ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కుమారుడికి తమ్ముడు బాలకృష్ణ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం ద్వారా వియ్యం అందుకుంటున్నారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే సి. రామచంద్రయ్యతోనూ ఇంతకు ముందే కదిరి బాబూరావు వియ్యం అందుకున్నారు.

Also Read : ఆలీని జ‌గ‌న్ అందుకే ర‌మ్మ‌న్నారా?