iDreamPost
android-app
ios-app

అవినీతిపై యుద్ధం

అవినీతిపై యుద్ధం

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో విప్లవానికి తెరలేపారు. అవినీతి అంతానికి పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు జ్యూడిషియల్ ప్రివ్యూ అనుమతి తప్పనిసరి చేసిన ఆయన… అవినీతి చేస్తూ దొరికిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏసీబీకి ఉన్న కోరలు పేకేశాయి. అవినీతికి పాల్పడుతూ దొరికిపోయిన అధికారులు భేషుగ్గా ఉండే వారు. కానీ, ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అవినీతికి పాల్పడాలనే ఆలోచన ఉన్న అధికారుల వెన్నులో వణుకు మొదలుకానుంది.

అవినీతి కేసులపై వంద రోజుల్లోనే శాఖాపరమైన అన్ని చర్యలు పూర్తిచేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి రహిత పాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న అనేక వినూత్న చర్యల్లో భాగంగానే వంద రోజుల్లో ఏసీబీ కేసులను తేల్చాలనే నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో అవినితి చేస్తూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలను తీసుకోవడానికి గడువు ఉండేది కాదు. దీంతో ఆయా కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. ఇలా 1995 నుంచి కూడా అవినీతి కేసుల్లో పట్టుబడిన వారిపై శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉండటం వల్ల వారి సేవలు అందకపోగా, వారిపై క్రమశిక్షణ చర్యల్లో జాప్యం జరుగుతోంది.

1991 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 1,686 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో లంచం తీసుకుంటూ పట్టుబడినవి 476 కేసులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ అవినీతి కేసుల్లో పట్టుబడిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలను వంద రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి కేసులో ఒక్కరోజులో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. సంబంధిత శాఖకు 24 గంటల్లో సమాచారం ఇవ్వాలి. ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌ (ఏపీవీసీ)కి 21 రోజుల్లోనే ఏసీబీ నివేదిక ఇవ్వాలి. శాఖాపరమైన చర్యలకు, న్యాయపరమైన విచారణకు 45 రోజుల్లోనే చర్యలు చేపట్టాలి. మూడు నెలల్లో ఆ ఉద్యోగిపై సంబంధిత ప్రభుత్వశాఖకు తుది నివేదిక అందించాలి. తుది నివేదిక అందిన పది రోజుల్లోనే ఆ ఉద్యోగిపై ఎటువంటి చర్యలు తీసుకునేది తేల్చాలి. ఈ విధంగా అవినీతి కేసుల్లో సత్వర చర్యలు తీసుకోవడం వల్ల అవినీతిపరుల్లో భయం రానుంది.